Rohit Sharma:లార్డ్స్‌ లో సీరీస్ పట్టేయాలి

సొంత గడ్డపై ఇంగ్లండ్‌ సూపర్ ఫామ్‌లో ఉండటంతో భారత్ తో వన్డే సీరీస్ లో పలు రికార్డులు బ్రేకవడం ఖాయమని అంతా అనుకున్నారు.

  • Written By:
  • Publish Date - July 14, 2022 / 12:01 PM IST

సొంత గడ్డపై ఇంగ్లండ్‌ సూపర్ ఫామ్‌లో ఉండటంతో భారత్ తో వన్డే సీరీస్ లో పలు రికార్డులు బ్రేకవడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా తొలి మ్యాచ్‌ను టీమిండియా ఏకపక్షంగా గెలిచేసింది . బుమ్రా పేస్‌ ధాటికి ఇంగ్లిష్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 లీడ్‌ సాధించిన రోహిత్‌ సేన.. లార్డ్స్‌లో గురువారం జరగబోయే రెండో వన్డేతోనే సిరీస్‌ గెలవాలని చూస్తోంది.

తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే భారత్ ఆడనుంది.తొలి వన్డేలో స్వల్ప లక్ష్యమే అయినా రోహిత్‌ మెరుపు బ్యాటింగ్‌ హైలైట్‌గా నిలిచింది. ధావన్‌ తన ఇన్నేళ్ల శైలికి భిన్నంగా బాగా నెమ్మదిగా ఆడటం కొంత ఆశ్చర్యపరిచే అంశమే అయినా…ఈ మ్యాచ్‌లో అతను దూకుడు పెంచాలి. శ్రేయస్, సూర్యకుమార్, పంత్‌లతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. హార్దిక్, జడేజా కూడా భారీ స్కోరులో సాధించే సత్తా ఉన్నవారే. అటు బౌలింగ్‌లో బుమ్రా, షమీ మరోసారి ప్రధానాస్త్రాలుగా ప్రత్యర్థిపై చెలరేగడం ఖాయం. ప్రసిధ్‌ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. వీరికి తోడు స్పిన్నర్లు కూడా ఫామ్ లో ఉండడంతో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు తొలి వన్డేలో దెబ్బ తిన్న ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుందని ఇంగ్లిష్‌ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌, లివింగ్‌స్టోన్‌లాంటి బ్యాటర్లతో ఇంగ్లండ్‌ లైనప్‌ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. వీరంతా గత మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యారు.
మిడిలార్డర్‌లో రూట్, స్టోక్స్‌ ఎంత బాధ్యతగా ఆడతారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి బట్లర్‌ పాత్ర కీలకం కానుంది. బ్యాటర్‌గా ఘనమైన రికార్డు ఉన్న అతను రెగ్యులర్‌ కెప్టెన్‌గా తొలి టి20 సిరీస్‌లో తడబడ్డాడు. సిరీస్‌ కోల్పోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో వన్డే సీరీస్ లో ఫామ్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. తొలి మ్యాచ్ లో ఓడినా ఇంగ్లాండ్ టీమ్ నీ తేలిగ్గా తీసుకోలేమని చెప్పుచు.ఈ రెండో వన్డేకు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ గ్రౌండ్‌ ఆతిథ్యమిస్తోంది.ఇక్కడి పిచ్‌ ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లకు సమానంగా అనుకూలించే అవకాశం ఉంది.