Rohit Sharma: కోహ్లీ, రోహిత్‌ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?

టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) ప్లాన్స్ లో వీరిద్దరితో పాటు పలువురు సీనియర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తోంది. 2024లో జరిగే మెగా టోర్నీకి పూర్తి యువ జట్టునే సిద్ధం చేయాలనుకుంటున్న సెలక్టర్లు సీనియర్లకు దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - January 10, 2023 / 01:56 PM IST

టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) ప్లాన్స్ లో వీరిద్దరితో పాటు పలువురు సీనియర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తోంది. 2024లో జరిగే మెగా టోర్నీకి పూర్తి యువ జట్టునే సిద్ధం చేయాలనుకుంటున్న సెలక్టర్లు సీనియర్లకు దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ వైఫల్యం తర్వాత టీమిండియాలో భారీ మార్పులపైనే దష్టి పెట్టింది బీసీసీఐ.. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే మళ్ళీ పొట్టి ఫార్మాట్ లో ప్రపంచ విజేతగా నిలవడం కష్టమేనన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

2024లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు జట్టును సిద్ధం చేయడంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే పలువురు సీనియర్లకు ఉద్వాసన పలకబోతోంది. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతో పాటు అశ్విన్, దినేశ్ కార్తీక్, షమీ వంటి వాళ్ళున్నారు. ఈ కీలక నిర్ణయాల తీసుకునే ముందు బీసీసీఐ గట్టి కసరత్తే చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటుతున్నా మెగా టోర్నీల్లో మాత్రం విఫలమవుతోంది. ఐపీఎల్ , తీరిక లేని అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌తో ఆటగాళ్ళు అలసిపోతుండడం, వరుస గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు వంటివి దీనికి కారణంగా చెప్పొచ్చు. అదే సమయంలో పలువురు యువ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయిలో సరైన అవకాశాలు కల్పించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. వైఫల్యాల బాటలో ఉన్నప్పటకీ కొందరు సీనియర్లను షార్ట్ ఫార్మాట్‌లో కొనసాగించడంపైనా చాలా మంది మండిపడుతున్నారు.

గత ప్రపంచకప్‌లోనూ టీమిండియా అంచనాలు అందుకోలేకపోవడంతో మార్పులు చేయాల్సిందేనని బీసీసీఐ దాదాపుగా నిర్ణయించింది. మిషన్ 2024 వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టును రెడీ చేయబోతోంది. దీని కోసం సీనియర్లకు ఉద్వాసన పలకక తప్పేలా లేదు. బోర్డు మాత్రం దీని గురించి ఇప్పటికే వారికి సమాచారమిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన వారిపై వేటు వేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకున్నా.. రోహిత్ , కోహ్లీలను తప్పించడం ఎంతవరకూ కరెక్ట్ అనే వాదన కూడా వినిపిస్తోంది. సీనియర్లు, యువ క్రికెటర్ల కూర్పుతోనే విజయాలు సాధ్యమవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: IAS officer Ashok Khemka: 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. ఎవరీ అశోక్ ఖేమ్కా..?

మరోవైపు టీ ట్వంటీలకు తాను గుడ్‌బై చెప్పడం లేదన్న రోహిత్‌ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకున్నానంటూ హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించడంతో టీ ట్వంటీల్లో కొనసాగేందుకే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ , వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పైనే తాను దృష్టి పెట్టానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అటు కోహ్లీ మాత్రం దీనిపై ఏమీ స్పందించలేదు. ఇదిలా ఉంటే వచ్చే ప్రపంచకప్ సమయానికి రోహిత్‌ ఎంతవరకూ ఫిట్‌నెస్‌తో ఉంటాడనేది డౌటే. కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో ఇలాంటి సందేహాలు లేకున్నా మరో ఏడాదిన్నరకు పైగా నిలకడగా రాణిస్తాడా అనేది డౌటే.

ఇప్పటికే టీ ట్వంటీ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా రోహిత్‌ స్థానంలో టీ ట్వంటీ పగ్గాలు పాండ్యాకే అనేది తేలిపోయింది. అలాగే జట్టు విషయంలోనూ ఇదే తరహా నిర్ణయాలకు బోర్డు వెనుకాడేలా కనిపించడం లేదు. ఎందుకంటే మిగిలిన దేశాలను చూస్తే యువ ఆటగాళ్ళు, ఆల్‌రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. బీసీసీఐ కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న పలువురు యువ ఆటగాళ్ళకు రానున్న రోజుల్లో వరుస అవకాశాలు ఇచ్చి వారిని పరీక్షించనుంది. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్‌లో 20 మందితో ప్రాబబుల్స్‌ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది.