TeamIndia: టీ20 నుంచి రోహిత్, విరాట్ ఔట్..?

టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా ఇతర సీనియర్‌ ఆటగాళ్లందరూ వచ్చే ఏడాది నుంచి టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని బీసీసీఐ

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 04:27 PM IST

టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా ఇతర సీనియర్‌ ఆటగాళ్లందరూ వచ్చే ఏడాది నుంచి టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 2024 టీ20 ప్రపంచ కప్‌కు కొత్త టీమిండియా సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఆ కొత్త టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. ‘’బీసీసీఐ ఏ ఆటగాడిని రిటైర్మెంట్ కోరలేదు. అది ఆటగాడి స్వంత నిర్ణయం. 2023లో చాలా మంది సీనియర్‌లను వన్డేలు, టెస్టులపై దృష్టి పెట్టాలని బీసీసీఐ కోరవచ్చు. టీ20లకు యువ జట్టు అందుబాటులో ఉంటుంది.’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది కాలంలో టీమిండియా చాలా మంది కెప్టెన్లను చూసింది. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు భారత క్రికెట్‌లో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. కొన్నిసార్లు రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యాడు. కొన్నిసార్లు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వగా, కొన్నిసార్లు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. అయితే గత ఏడాది కాలంగా రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

న్యూజిలాండ్ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నప్పటికీ..అయితే రాబోయే కాలంలో టీ20లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ చాలా కాలం పాటు భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాడు. కానీ అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు ఒక్క ICC ట్రోఫీని కూడా అందించలేకపోయాడు. దీని తర్వాత రోహిత్ శర్మకు ప్రపంచకప్‌లో ఈ అవకాశం లభించింది. కానీ అతను కూడా విఫలమయ్యాడు.

ఇప్పుడు టీమిండియా టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్‌గా భావిస్తున్న హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే కెప్టెన్‌గా అవకాశం లభించగా.. అందులో భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్‌ని టైగా ముగించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీం ఇండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ అవకాశం వచ్చినా.. రాబోయే కాలంలో మరిన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తాడంటే.. అతడెలాంటి కెప్టెన్‌ అనేది అప్పుడే తెలుస్తుంది.