Ishan Kishan: ప్రైస్ ట్యాగ్ గురించి మర్చిపోయి ఆడమన్నారు.. రోహిత్, కోహ్లీ సలహాతోనే ఒత్తిడిని అధిగమించా : ఇషాన్ కిషన్

ఐపీఎల్ లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - May 11, 2022 / 04:07 PM IST

ఐపీఎల్ లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు. జార్ఖండ్ టీమ్ కు చెందిన ఈ వికెట్ కీపర్ ను ఐపీఎల్ వేలంపాటలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం భారీగా రూ.15.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇంత భారీ ధర దక్కడంతో ఇషాన్ కిషన్ తొలి రోజుల్లో చాలా ఒత్తిడికి లోనయ్యారట. ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలియలేదట. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లను కలిసి తన పరిస్థితిని చెప్పాడట. వాళ్ళు సూటిగా సుత్తి లేకుండా ఒకే విషయం చెప్పారట.. ‘ నువ్వు నీకు ఇచ్చిన ధర గురించి అస్సలు ఆలోచించకు. నీపై, నీ ఆటపై నమ్మకంతో అంత భారీ ధరకు నిన్ను సొంతం చేసుకున్నారు. దాన్ని అంతటితో వదిలేయ్. నీ ఆటను మెరుగుపర్చుకోవడం గురించి, ప్రతి మ్యాచ్ లో బాగా ఆడటం గురించి మాత్రమే ఆలోచించు’ అని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సూచించారట. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ ఫోకస్డ్ గా ఐపీఎల్ మ్యాచ్ లు అడగలుగుతున్నారట. ఈవిషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘ విరాట్ భాయ్, రోహిత్ భాయ్ సలహా తీసుకున్న నాటి నుంచి నేను సోషల్ మీడియా గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవ్వరు .. ఏం రాసుకున్న ఫర్వాలేదు.. నా ఆలోచన అంతా నేను ఆడే మ్యాచ్ లపైనే ఉంటుంది’ అని ఇషాన్ కిషన్ తేల్చి చెప్పారు.

ఆటతీరు భళా..

గత 11 ఐపీఎల్ మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ కోసం ఇషాన్ కిషన్ 321 రన్స్ చేశారు. తాజాగా ఈనెల 9న (సోమవారం) కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ చక్కగా ఆడి 51 రన్స్ చేశాడు. ఆ రోజున ముంబై ఇండియన్స్ 113 పరుగులకే ఆల్ ఔట్ అయింది . జట్టు స్కోర్ లో సగం రన్స్ ను ఇషాన్ కిషన్ ఒక్కడే చేయడం గమనార్హం. దీన్నిబట్టి అతడు ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.కిషన్ వ్యక్తిగతంగా ఫామ్ లో ఉన్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములను ఎదుర్కొంటూ తడబడుతుండటం ప్రతికూల అంశంగా పరిణమిస్తోంది.