Rohit Sharma- Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli) టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వీరిద్దరినీ మళ్ళీ షార్ట్ ఫార్మాట్‌లో చూడలేమా.. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2024 టీ ట్వంటీ వరల్డ్‌కప్ లక్ష్యంగా టీమ్‌ను సెలక్టర్లు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే యువక్రికెటర్లకు ప్రాధాన్యతనిస్తుండగా.. కోహ్లీ,రోహిత్‌లను పక్కన పెడుతున్నారని చెబుతున్నారు. టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచి 12 ఏళ్ళు దాటిపోయింది. టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి కూడా 16 ఏళ్ళవుతోంది..ఐపీఎల్‌తో ఎంతోమంది టీ ట్వంటీ స్టార్స్ వెలుగులోకి వచ్చినా మెగా టోర్నీలో మాత్రం టైటిల్ విజయం భారత్‌కు అందని ద్రాక్షగానే ఉంటోంది.
గత ఏడాది కూడా టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో నిరాశే మిగిలింది. దీంతో వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ జట్టును సిద్ధం చేస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి యువక్రికెటర్ల వైపే మొగ్గుచూపుతోంది. తాజాగా విండీస్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టే దీనికి ఉదాహరణ. అయితే ఇదే సమయంలో సీనియర్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా రాణించడం లేదు. ఒకప్పుడు అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టిన కోహ్లీ, రోహిత్ ప్రస్తుత ఫామ్ స్థాయికి తగినట్టుగా లేదు. అందుకే టీ ట్వంటీ టీమ్ నుంచి వీరిద్దరినీ సెలక్టర్లు పక్కన పెట్టారన్నది అర్థమవుతోంది. రెస్ట్ పేరుతో వీరిద్దరిని పక్కన పెట్టామని చెబుతున్నా షార్ట్ ఫార్మేట్‌లో వీరిద్దరి కెరీర్ ముగిసినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: PCB New Chairman: పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్
ఇప్పటి వరకూ కోహ్లీ 115 టీ ట్వంటీల్లో 4008 పరుగులు చేయగా..37 హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. అటు రోహిత్ కెరీర్‌ను చూస్తే 148 టీ ట్వంటీల్లో 3853 పరుగులు చేయగా..29 సెంచరీలు, 4 శతకాలు ఉన్నాయి. గత ఏడాది ప్రపంచకప్ నుండీ వీరిద్దరి టీ ట్వంటీ ప్రదర్శన దూకుడుగా లేదు. ఐపీఎల్‌లో పర్వాలేదనిపిస్తున్నా అంతర్జాతీయ టీట్వంటీల్లో మాత్రం అంచనాలు అందుకోవడం లేదు. ఈ కారణంగానే సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ లక్ష్యంగా టీమ్‌ను ఎంపిక చేస్తూ వస్తోంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సెలక్టర్లు టీ ట్వంటీ జట్టుకు త్వరలోనే పూర్తిస్థాయి సారథిగా అతన్ని ప్రకటించే అవకాశముంది. అటు ఐపీఎల్‌తో పాటు దేశవాళీ ట్వంటీ టోర్నీల్లో పలువురు క్రికెటర్లు అదరగొడతుండడంతో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే వరుసగా పలు సిరీస్‌లకు కోహ్లీ, రోహిత్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు పరోక్షంగా తప్పుకోమని చెప్పకనే చెప్పినట్టు అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించేందుకు స్వదేశంలో జరిగే ఏదైనా సిరీస్‌కు ఎంపిక చేయొచ్చు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే టీట్వంటీ టీమ్‌లో మళ్ళీ వీరిద్దరినీ చూడడం కష్టమనే భావిస్తున్నారు.