Vijay Hazare Trophy: భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఈసారి పలువురు సూపర్ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగగా, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
విరాట్ కోహ్లీ ‘చేజ్ మాస్టర్’ ఇన్నింగ్స్
ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌ను చాటారు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ఆయన 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదారు.
Also Read: సునీల్ గవాస్కర్ పర్సనాలిటీ హక్కుల రక్షణ.. ఒక చారిత్రాత్మక తీర్పు!
రోహిత్ శర్మ విధ్వంసం
మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు. మొత్తం మీద 94 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 155 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం.
