ODI Rankings: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో (ODI Rankings) తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు అగ్రశ్రేణి జాబితాలో కనిపించకపోవడంతో అభిమానులు, విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. గత వారం ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ రెండో స్థానంలో, కోహ్లీ నాలుగో స్థానంలో ఉండగా కొత్త జాబితాలో వారి పేర్లు టాప్ 100లో కూడా లేకపోవడం చర్చకు దారితీసింది.
ఐసీసీ పొరపాటుపై స్పందన
విషయం వెలుగులోకి రాగానే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చేసిన సాంకేతిక పొరపాటని తేలింది. వన్డే ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసే క్రమంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లను పొరపాటున తొలగించినట్లు ఐసీసీ గుర్తించింది. అభిమానుల నుంచి, మీడియా నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ వెంటనే స్పందించి ర్యాంకింగ్స్‌ను సవరించింది. సవరించిన జాబితాలో రోహిత్, కోహ్లీల పేర్లు తిరిగి చేర్చబడ్డాయి. వారి పాత స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ఘటన ఐసీసీ అధికారిక ప్రక్రియల్లోని లోపాలను వెల్లడించింది.
Also Read: Agni 5 Ballistic Missile: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి విజయవంతం.. దాని ప్రత్యేకతలీవే!
కోహ్లీ, రోహిత్‌ల భవిష్యత్తు
ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్ట్, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేలపైనే దృష్టి సారించారు. త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. వారి అనుభవం, నిలకడ జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పొరపాటుపై ఐసీసీ నుంచి అధికారిక వివరణ ఇంకా వెలువడలేదు. అయితే ఇలాంటి లోపాలు జరగకుండా భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2025 సమయంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకు ముందు టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత వారు టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో వన్డేల నుంచి కూడా రిటైర్ కావాలని బీసీసీఐ రోహిత్ శర్మకు సూచించినట్లు తెలిసింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై బీసీసీఐ భిన్నమైన వైఖరి
అయితే విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ ఆలోచన భిన్నంగా ఉంది. కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027 వరకు ఆడవచ్చు అని బోర్డు భావిస్తోంది. ఎందుకంటే కోహ్లీ ప్రస్తుతం 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు. వన్డే క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. మరోవైపు, రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వైఖరి వేరుగా ఉంది. అతని ఫిట్‌నెస్ విరాట్ కోహ్లీ అంత మెరుగ్గా లేదని బోర్డు భావిస్తోంది. ఈ కారణాల వల్ల వన్డే ప్రపంచ కప్ 2027 వరకు రోహిత్ శర్మను కొనసాగించడంపై బోర్డు భిన్నంగా ఆలోచిస్తోంది.