Rohit Sharma: భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ క్రికెట్ రంగానికి అందించిన అసాధారణ సహకారం, ఆయన నమూనా నాయకత్వానికి గుర్తింపుగా అజింక్యా డివై పాటిల్ యూనివర్సిటీ (ADYPU) గౌరవ డాక్టరేట్ (D.Litt.) ప్రకటించింది. శనివారం, 24 జనవరి 2026న జరిగే స్నాతకోత్సవంలో ఆయనకు ఈ గౌరవం లభించనుంది.
రోహిత్ మళ్ళీ ముఖ్య అతిథిగా
పూణేలోని అజింక్యా డివై పాటిల్ యూనివర్సిటీ బుధవారం ఈ ప్రకటన చేసింది. యూనివర్సిటీ చారిత్రాత్మకమైన 10వ స్నాతకోత్సవం తారల మెరుపులతో కూడిన ఒక గొప్ప వేడుకగా ఉండబోతోందని, అందులో రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని యూనివర్సిటీ తెలిపింది. యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఛాన్సలర్ డాక్టర్ అజింక్యా డి వై పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో క్రీడలు, ప్రపంచ వేదికపై రోహిత్ కనబరిచిన నాయకత్వ పటిమకు గానూ ఆయనను సత్కరించనున్నారు.
Also Read: ఆందోళనకరమైన విషయం.. భారత్‌లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
ఈ గౌరవం ఎందుకు దక్కుతోంది?
యూనివర్సిటీ తన ప్రకటనలో ఇలా పేర్కొంది. ఈ గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేయడం ద్వారా రోహిత్ శర్మ కనబరిచే రెజిలెన్స్ (స్థిరత్వం), స్ట్రాటజీ (వ్యూహం) వంటి విలువైన లక్షణాలను ADYPU గుర్తిస్తోంది. ఈ లక్షణాలు 2026 గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తాయి అని రాసుకొచ్చింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ ముంబై నుండి పూణేకు ప్రయాణించనున్నారు.
గతంలోనూ యూనివర్సిటీ ముఖ్య అతిథిగా
డిసెంబర్ 2025లో రోహిత్ శర్మ హర్యానాలోని గురుగ్రామ్‌లో గల ‘మాస్టర్స్ యూనియన్’ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. యాషెస్ టెస్ట్ సిరీస్‌ను ప్రస్తావిస్తూ.. ఆస్ట్రేలియాలో ఆడటం ఎంత కష్టమో ఇంగ్లాండ్ జట్టును అడగండి అని ఆయన అన్నారు. అప్పట్లో ఈ ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
