Rohit Sharma: బయట కూర్చుని మాట్లాడేవాళ్ళకు ఏం తెలుసు.. కోహ్లీకి రోహిత్ సపోర్ట్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది.

  • Written By:
  • Updated On - July 11, 2022 / 05:02 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. మూడేళ్ళుగా ఫామ్ కోసం తంటాలు పడుతుండడంతో అతన్ని టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఆడించడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్‌శర్మ మాత్రం కోహ్లీకి పూర్తి మద్ధతుగా నిలిచాడు. ఒక అద్భుతమైన ఆటగాడిని రెండు మూడు సిరీస్‌ల ప్రదర్శనతో పక్కన పెట్టాలన్న కపిల్‌దేవ్ వ్యాఖ్యలను తప్పుపట్టాడు.
ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ రికార్డులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ పరుగుల వరద పారించాడు. అయితే గత మూడేళ్ళుగా రన్‌మెషీన్ పూర్తిగా వెనుకబడిపోయాడు. ఒకప్పుడు సెంచరీల మోత మోగించిన విరాట్ ఇప్పుడు శతకం సాధించి మూడేళ్ళు దాటిపోయింది.

ఫామ్‌ కోల్పోవడంతోనే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ ఆ తర్వాత కూడా గాడిన పడలేదు. ఎటువంటి ఒత్తిడి లేనప్పటకీ పరుగులు చేసేందుకు సతమతమవుతున్నాడు. ఐపీఎల్‌లో సైతం విరాట్‌ పెద్దగా రాణించలేదు. అదే సమయంలో పలువురు యువ ఆటగాళ్ళు జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూస్తుండడంతో టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో కోహ్లీకి చోటు ఉంటుందా అన్న చర్చ మొదలైంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ కోహ్లీ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ ట్వంటీ టీమ్ నుంచి కోహ్లీని తప్పిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. అశ్విన్ లాంటి సీనియర్ బౌలర్‌ను టెస్టులకే పరిమితం చేసినప్పుడు విరాట్ విషయంలో కూడా అదే పాటించాలన్నాడు. కేవలం ఆటగాడి గత రికార్డులు, పేరు ప్రఖ్యాతులు చూసి జట్టులో కొనసాగిచడం సరికాదంటూ కపిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు కపిల్‌దేవ్ వ్యాఖ్యలపై భారత జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ మండిపడ్డాడు. కోహ్లీకి పూర్తి మద్ధతుగా నిలిచిన హిట్‌మ్యాన్ ఇలాంటి విమర్శలు పట్టించుకోమన్నాడు. బయట కూర్చుని కామెంట్స్ చేసే వారికి టీమ్‌లో ఏం జరుగుతుందో తెలీదన్నాడు.

టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం జట్టు కూర్పుపై టీమ్‌ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టిన వేళ ఇంగ్లాండ్‌తో ముగిసిన సిరీస్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. చెత్త షాట్లతో ఔటవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన లేదన్నాడు. రెండు, మూడు సిరీస్‌ల ప్రదర్శనతో కీలకమైన ఆటగాడిని పక్కన పెట్టలేమన్నాడు. ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఫామ్ కోల్పోవడం సహజమని, దీనివల్ల ప్లేయర్‌ క్వాలిటీ దెబ్బతినదన్నాడు. ఇలాంటి విషయాలు తాము దృష్టిలో ఉంచుకుంటామన్నాడు. అతని గత ఆటతీరును విస్మరించకూడదన్న రోహిత్ టీమ్‌లో ఉన్న వాళ్లకే ప్లేయర్‌ ప్రాముఖ్యత తెలుస్తుందన్నాడు. వాళ్లకు తమ గురించి మాట్లాడే హక్కు ఉండొచ్చు కానీ తాము వాటిని పెద్దగా పట్టించుకోమని రోహిత్‌ స్పష్టం చేశాడు. కాగా టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మరో నాలుగు సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో కోహ్లీపైనే అందరి దృష్టీ ఉంది. విండీస్‌తో సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేయడంపై సెలక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటకీ… తర్వాత జరిగే సిరీస్‌లలో విరాట్ ఫామ్‌ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.