Site icon HashtagU Telugu

World Cup 2023: రోహిత్ ఉగ్రరూపం .. సెంచరీతో వీరవిహారం

World Cup 2023 (27)

World Cup 2023 (27)

World Cup 2023: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఉగ్రరూపం దాల్చాడు. ఆఫ్ఘన్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రోహిత్ హిట్టింగ్ కి ఆఫ్ఘన్ బౌలర్లు తేలిపోయారు. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఏకంగా సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. మొదటి 25 బంతుల్లో 14 పరుగులే చేసిన కిషన్, 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 18 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్‌కి 154 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

రోహిత్ సెంచరీ దెబ్బకు అనేక రికార్డులు బద్దలయ్యాయి. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు సమం చేశాడు. అదేవిధంగా 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలోపు హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్ ద్వారా కెరీర్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును సాధించాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ (553) పేరుతో ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. భారత ఇన్నింగ్స్‌‌లో 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ హక్ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదాడు. గేల్ 551 ఇన్నింగ్స్‌లలో 553 సిక్సర్లు బాదగా.. రోహిత్ మాత్రం 473 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను సాధించాడు.

Also Read: Nara Lokesh : IRR కేసులో ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. నేరుగా ఢిల్లీకి బ‌య‌ల్దేరిన లోకేష్‌