ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.
𝙑𝙞𝙣𝙩𝙖𝙜𝙚 𝙍𝙤𝙝𝙞𝙩 🔥
1⃣2⃣1⃣* runs
1⃣2⃣5⃣ balls
1⃣3⃣ fours
3⃣ sixesFor his masterclass knock, Rohit Sharma wins the Player of the match award 🥇
Scorecard ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 pic.twitter.com/OQMTCGzOMD
— BCCI (@BCCI) October 25, 2025
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో అదరగొట్టారు. రోహిత్ శర్మ తన కెరీర్‌లో 50వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ.. మరో వన్డే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 236 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్.. మరో 11.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన టీమిండియా బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో సత్తాచాటారు. ముఖ్యంగా హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. దీంతో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 2, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, గిల్ తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 69 పరుగులు జోడించారు. శుభ్‌మన్ గిల్ (24) ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. సత్తాచాటాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన ఈ రన్ మెషీన్ మూడో వన్డేలో మాత్రం తన క్లాస్ ఆటతో పాత విరాట్‌ను గుర్తు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 168 పరుగులు జోడించారు.
రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన హిట్‌మ్యాన్.. ఈ మ్యాచ్‌లో శతక్కొట్టాడు. 105 బంతుల్లో మూడంకెల మార్కును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం వన్డేల్లో తన 75వ హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో టీమిండియా ఛేజింగ్ సాఫీగా సాగింది. రోహిత్, కోహ్లీ దెబ్బకు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి పేసర్లు సైతం తేలిపోయారు. దీంతో భారత్.. 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74) నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో భారత్.. సిరీస్‌ను 1-2తో ముగించింది. ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.

