Site icon HashtagU Telugu

Rohit Sharma: క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ.. ఏం చేశాడో తెలుసా..!

rohit

Resizeimagesize (1280 X 720) 11zon

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న గువాహటిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్వితీయ విజయంతో ఆకట్టుకుంది. 67 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక కెప్టెన్ దాసున్ షనక అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ప్రశంసలు అందుకున్నాడు.

మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న షనక 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేసి తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. అయితే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చివరి ఓవర్ నాలుగో బంతి వేస్తున్న సమయంలో షనక నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పటికి షనక సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. షమీ నాలుగో బంతిని సంధించక ముందే షనక క్రీజు వదిలి బయటకు వచ్చాడు. గమనించిన షమీ వికెట్లను గిరాటేసి అప్పీల్ చేశాడు. నిజానికైతే ఇది అవుటే. అయితే.. అనుమానం ఉన్న ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేశాడు. అయితే అప్పటికి షనక 98 పరుగులతో ఉండడంతో రోహిత్ శర్మ కల్పించుకున్నాడు. షమీతో మాట్లాడి అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో లంక కెప్టెన్ బతికిపోయాడు. ఆ బంతికి ఓవర్ త్రో కారణంగా ఐదు పరుగులు వచ్చాయి. స్ట్రయికింగ్‌కు వచ్చిన షనక ఐదో బంతిని బౌండరీకి పంపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షనక సెంచరీ కోల్పోకుండా రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మ్యాచ్ అనంతరం రోహిత్ తన ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘షమీ ఇలా (రన్ అవుట్) చేశాడని నాకు తెలియదు. అతను (షనక) 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. మేము అతనిని ఇలా అవుట్ చేయలేకపోయాము. ఇది మనం అనుకున్నది కాదు. అతనికి హ్యాట్సాఫ్, అతను బాగా ఆడాడని తెలిపాడు.