Rohit Sharma Record : హిట్ మ్యాన్ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్ టూర్ తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. టీ ట్వంటీ ల్లో చాలా కాలంగా హాఫ్ సెంచరీ చేయని హిట్ మ్యాన్ విండీస్ పై తొలి మ్యాచ్ లో సత్తా చాటాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ అర్ధ శతకం సాధించాడు

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 10:42 AM IST

ఇంగ్లాండ్ టూర్ తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. టీ ట్వంటీ ల్లో చాలా కాలంగా హాఫ్ సెంచరీ చేయని హిట్ మ్యాన్ విండీస్ పై తొలి మ్యాచ్ లో సత్తా చాటాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ అర్ధ శతకం సాధించాడు. 23 ఇన్నింగ్స్ ల తర్వాత అర్థ సెంచరీ సాధించాడు. చివరిసారిగా అతడు.. టీ20 ప్రపంచకప్ ముగిశాక న్యూజిలాండ్ తో నవంబర్ లో చివరిసారి అర్థ శతకం బాదాడు. కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ అరుదైన రికార్డు అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను అధిగమించి రోహిత్‌ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. తొలి టీ20‍లో 64 పరుగులు చేసిన రోహిత్‌ ఈ రికార్డును మళ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.. రోహిత్‌ ప్రస్తుతం 3,443 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

పొట్టి ఫార్మాట్ లో అత్యధిక పరుగుల రికార్డు గతంలో రోహిత్ పేరిటే ఉండేది. రెండ్రోజుల క్రితం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ గప్తిల్ ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గప్తిల్.. ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ కు ముందు 3,399 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ ఈ మ్యాచ్ లో రోహిత్.. 44 బంతుల్లో 64 పరుగులు చేసి మళ్లీ ఆ అగ్రస్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తొలి టీ20లో 21 పరుగులు చేశాక రోహిత్.. గప్తిల్ ను అధిగమించాడు. రోహిత్ శర్మ 129 మ్యాచులలో 3,443 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా… 116 మ్యాచులలో 3,399 పరుగులతో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి 3308 పరుగులు, ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌ 2894 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 2855 పరుగులు ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గప్తిల్-రోహిత్ ల అగ్రస్థానం కోసం మరికొన్ని రోజులు హోరాహోరీ తప్పేట్టు లేదు. ఇరు జట్లు వరుసగా ఎక్కువ టీ ట్వంటీలు ఆడనున్న నేపథ్యంలో ఆధిపత్యం చేతులు మారడం ఖాయం.