Ind vs Aus: తొలి రోజు మనదే… భారీ ఆధిక్యంపై భారత్ కన్ను

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరుసగా మూడోసారి గెలవలనుకుంటున్న భారత జట్టుకు తొలి రోజు అదరగొట్టింది. ఇటు బంతితోనూ, అటు బ్యాట్ తోనూ డామినేట్ చేసింది.

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 10:44 PM IST

India vs Australia 1st Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరుసగా మూడోసారి గెలవలనుకుంటున్న భారత జట్టుకు తొలి రోజు అదరగొట్టింది. ఇటు బంతితోనూ, అటు బ్యాట్ తోనూ డామినేట్ చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యంపై కన్నేసింది. టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే భారత్ తరపున టెస్టుల్లోకి సూర్య కుమార్ యాదవ్, కే ఎస్ భరత్ అరంగేట్రం చేశారు. మొదట్లోనే భారత పేస్ బౌలర్లు షాకిచ్చారు. సిరాజ్, షమి ధాటికి ఆస్ట్రేలియా 2 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.మహ్మద్ సిరాజ్ తాను వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. ఓ ఔట్ స్వింగర్ తో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అతడు ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే డేవిడ్ వార్నర్ ను షమీ పెవిలియన్ కు పంపాడు. తర్వాత ఆసీస్ కొద్దిసేపు నిలకడగా ఆడింది. అయితే జడేజా ఎంట్రీతో కంగారూలకు చుక్కలు కనిపించాయి.లంచ్ బ్రేక్ అనంతరం క్రీజులో పాతుకు పోయిన స్మిత్, లబుషేన్ జోడీని జడేజా విడదీసాడు. ఇక్కడ నుంచి ఆసీస్ వికెట్ల పతనం వేగంగా సాగింది.

పీటర్ హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్ క్యారీ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడి‌ని అశ్విన్ విడదీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 15 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను ఆసీస్ కోల్పోయింది.
భారత బౌలర్లలో జడేజా 5 ,అశ్విన్‌ 3, సిరాజ్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ 71 బంతుల్లో ఫోర్‌తో 20 మరోసారి విఫలమయ్యాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(0) మరో వికెట్ పడకుండా ఆడాడు.పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా ఆచి తూచి ఆడితే కీలకమయిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం భారీగానే సాధించే అవకాశం ఉంది.