టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. గాయంతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్ వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయానికి కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దీంతో వన్డే సిరీస్ కు సెలక్టర్లు రోహిత్ ను ఎంపిక చేయలేదు. పూర్తి ఫిట్ నెస్ సాధించడంతో పాటు బరువు తగ్గాలని సెలక్టర్లు రోహిత్ కు స్పష్టం చేశారు. ఫిట్ నెస్ విషయంలో అసలు రాజీ పడని కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం హిట్ మ్యాన్ కు ఇదే సలహా ఇచ్చాడు. దీంతో గత వారం మూడు రోజులు బ్రేక్ తీసుకున్న రోహిత్ ఇప్పుడు బరువు తగ్గడం కోసం శ్రమిస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేదా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ , సంజూ శాంసన్ కూడా ఎన్ సిఎలోనే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వారితో కలిసి జిమ్ సెషన్స్ లో రోహిత్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Great to see these two champions 🤗 Training with them is always fun 😁 pic.twitter.com/mpexyHR6of
— Shikhar Dhawan (@SDhawan25) January 3, 2022
బరువు సమస్య రోహిత్ ను చాలా కాలం నుండే వేధిస్తోంది. ఫిట్ గా ఉన్నప్పటకీ.. బరువు కారణంగా మోకాలిపై ప్రభావం పడుతుండడంతో రోహిత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికి తోడు గత ఏడాది తీరిక లేని షెడ్యూల్ కారణంగా బరువు తగ్గడంపై హిట్ మ్యాన్ దృష్టి పెట్టలేకపోయాడు. అయితే కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్టర్లు రోహిత్ బరువు విషయంలో ఖచ్చితమైన సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కనీసం 5 నుండి 6 కేజీల బరువు తగ్గాలని రోహిత్ కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత వన్డే కెప్టెన్ వచ్చే నెల రోజుల్లో ఈ టార్గెట్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
సౌతాఫ్రికాతో సిరీస్ నుండి బ్రేక్ తీసుకోవడం ఒక విధంగా రోహిత్ కు చాలా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే రానున్న 11 నెలలు భారత జట్టు తీరక లేని క్రికెట్ ఆడబోతోంది. ఐపీఎల్, ఇంగ్లాండ్ టూర్ , ఆసియా కప్, టీ ట్వంటీ వరల్డ్ కప్, ఆస్ట్రేలియా టూర్ వంటి మేజర్ సిరీస్ లు ఉండడంతో బరువు తగ్గేందుకు, పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది. బరువురు తగ్గితే సహజంగానే ఫిట్ నెస్ సమస్యలు కూడా తగ్గుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తం మీద హిట్ మ్యాన్ రీఎంట్రీలో మరింత ఫిట్ గా కనిపించబోతున్నాడు.