ICC ODI Ranking: వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. టాప్-10లో ముగ్గురు భారత్ ఆటగాళ్లు, 2019 తర్వాత ఇదే తొలిసారి..!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ల తాజా ర్యాంకింగ్స్‌ (ICC ODI Ranking)ను విడుదల చేసింది.

Published By: HashtagU Telugu Desk
Rohit-Virat

Rohit-Virat

ICC ODI Ranking: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ల తాజా ర్యాంకింగ్స్‌ (ICC ODI Ranking)ను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో అత్యుత్తమ రెండో స్థానం సాధించాడు. అతడితో పాటు మరో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. 2019 జనవరి తర్వాత ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10 జాబితాలో చేరడం ఇదే తొలిసారి. గిల్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్-10లో ఉన్నారు. కోహ్లీ 715 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 707 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు.

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 58 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌పై 122 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో వారు కూడా టాప్-10లో చోటు సంపాదించారు.

ICC పురుషుల ODI ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ కూడా టాప్-10లో చేర్చబడ్డారు. కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్ కంటే కంటే 100 ఎక్కువ రేటింగ్ పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్ వరుసగా ఐదు, 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Also Read: Ravindra Jadeja: ఇర్ఫాన్ పఠాన్ రికార్డు బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా

ఈ తాజా ర్యాంకింగ్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు, ఇంగ్లాండ్-న్యూజిలాండ్ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల ప్రదర్శన కూడా చేర్చబడింది. దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బావుమా తన చివరి ఎనిమిది వన్డేల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించి టాప్ 10కి చేరువలో ఉన్నాడు. 21 స్థానాలు ఎగబాకి అతను 11వ స్థానంలో ఉన్నాడు. అయితే దీనికి ముందు అతని అత్యుత్తమ ర్యాంకింగ్ 25వ స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ (ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి), ట్రావిస్ హెడ్ (ఆరు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు), మార్నస్ లాబుస్‌చాగ్నే (24 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు) అద్భుతమైన పురోగతి సాధించారు. అలాగే కేఎల్ రాహుల్ (10 స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి), ఇషాన్ కిషన్ (రెండు స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నారు). దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్, శ్రీలంకకు చెందిన సదీర సమరవిక్రమ, ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్, న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే కూడా తాజా ర్యాంకింగ్స్‌లో లాభపడ్డారు.

బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తొలిసారిగా టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లలో 9 వికెట్ల సహాయంతో ఐదు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు.

  Last Updated: 14 Sep 2023, 08:13 AM IST