Asia Cup: రోహిత్ వ్యూహం దెబ్బ తీసిందా ?

ఆసియా కప్ లో శ్రీలంక పై ఓటమిని భారత క్రికెట్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.

  • Written By:
  • Updated On - September 7, 2022 / 07:41 PM IST

ఆసియా కప్ లో శ్రీలంక పై ఓటమిని భారత క్రికెట్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓటమి అందరికీ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ పై మాజీ ఆటగాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో రోహిత్ బౌలింగ్ వ్యూహాన్ని తప్పు పడుతున్నారు. 19వ ఓవర్‌ను అర్షదీప్ సింగ్‌తో వేయించాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇలాంటి పిచ్‌లపై 180కి చేరువగా ఉన్న ఏ లక్ష్యమైనా మెరుగైన స్కోరేననీ, అక్కడ మంచు ప్రభావం లేదన్నాడు. దీని వల్ల బౌలింగ్ చేయడం సులభం అవుతుందనీ చెప్పాడు. శ్రీలంక కోల్పోయిన నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్లే తీసిన విషయాన్ని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ రెండో సారి కూడా తన వ్యూహాన్ని కోల్పోయాడనీ,. అర్షదీప్ సింగ్‌ను 19వ ఓవర్ బౌలింగ్ చేయించి ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు.

భువనేశ్వర్ ని చివరి ఓవర్లో ఉపయోగించుకుని ఉంటే బావుండేదన్నాడు. పాక్ తో మ్యాచ్ అనుభవం నుంచి ఈ విషయాన్ని రోహిత్ గుర్తించి ఉంటే లంకపై ఫలితం మరోలా ఉండేదన్నాడు. 19 వ ఓవర్లో భువనేశ్వర్ 14 పరుగులు ఇవ్వగా…చివరి ఓవర్లో శ్రీలంక విజయం కోసం 7 పరుగులు చేయాల్సి ఉంది. అర్షదీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించినా చేయాల్సిన రన్స్ ఎక్కువ లేకపోవడంతో ఓటమి తప్పలేదు.
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా…ఈ లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.