Ind Vs Eng : శుభారంభం ఎవరిదో ?

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. రీ షెడ్యూల్ టెస్టులో పరాజయం పాలైనప్పటికీ... టీ ట్వంటీ సిరీస్‌ను గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది.

  • Written By:
  • Updated On - July 12, 2022 / 03:48 PM IST

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. రీ షెడ్యూల్ టెస్టులో పరాజయం పాలైనప్పటికీ… టీ ట్వంటీ సిరీస్‌ను గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఓవల్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. టీ ట్వంటీ సిరీస్ విజయం ఇచ్చిన జోష్‌తో వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. భారత బ్యాటింగ్ విషయానికొస్తే చాలా రోజుల తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. దీంతో అతడు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. గత కొంతకాలంగా ఫామ్‌లో లేని హిట్‌మ్యాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీ గాయంతో దూరం కానుండడంతో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశముంది. వరుస సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో కోహ్లీని ఆడించి రిస్క్ తీసుకునే అవకాశం లేదని బోర్డు వర్గాల సమాచారం. మిగిలిన బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై మూడో టీ ట్వంటీ సెంచరీతో రెచ్చిపోయిన సూర్యకుమార్‌పై అంచనాలు పెరిగాయి. వన్డే జట్టులోనూ తన ప్లేస్ సుస్థిరం చేసుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలకం కానున్నారు. పంత్‌ పూర్తిస్థాయిలో గాడిన పడాల్సిన అవసరం ఉండగా.. ఆల్‌రౌండర్ పాండ్యా తన ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నాడు. అటు బౌలింగ్‌లోబుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్ పేస్ భారాన్నీ మోయనున్నారు. స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా టీ ట్వంటీ ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లాండ్‌కు ఇబ్బందులు తప్పవు. మరోవైపు టీ ట్వంటీ సిరీస్‌ను 2-1 తేడాతో ఓడిపోయిన ఇంగ్లాండ్.. ఇప్పుడు వన్డేల్లో రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది. బెయిర్‌స్టో, రూట్ వన్డే జట్టులోకి తిరిగి రావడంతో వారి కాన్ఫిడెన్స్ పెంచింది. ఇయాన్ మోర్గాన్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బట్లర్ ఈ సిరీస్‌ పరీక్షగానే చెప్పాలి. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో బట్లర్ ఫామ్‌తో పాటు బెయిర్ స్టో, మొయిన్ అలీ , స్టోక్స్ కీలకం కానున్నారు. ఇక టీ ట్వంటీ సిరీస్‌లో సత్తా చాటిన లివింగ్‌స్టోన్‌పైనా అంచనాలున్నాయి. బౌలింగ్ విషయానికొస్తే డేవిడ్ విల్లే, టోప్లేలతో పాటు బ్రైడన్ కార్స్ ఫామ్‌లో ఉండడం ఆతిథ్య జట్టుకు అడ్వాంటేజ్. వరల్డ్ కప్ సూపర్‌ లీగ్‌లో ఈ సిరీస్ కూడా ఉండడంతో ఇరు జట్లకూ విజయం కీలకమనే చెప్పాలి. అయితే సిరీస్ గెలిస్తే ఇంగ్లాండ్ వన్డేల్లో మళ్లీ వరల్డ్ నెంబర్ వన్‌ ర్యాంక్ దక్కించుకుంటుంది.