టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు మరో సీరీస్ విజయంపై టీమిండియా కన్నేసింది. సౌతాఫ్రికాపై తొలి టీ ట్వంటీలో ఘన విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్ లోనూ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. బుమ్రా గాయంతో వైదొలిగినప్పటికీ భారత బౌలింగ్ ఆకట్టుకుంటోంది. దీపక్ చాహార్, అర్ష దీప్ సింగ్, హార్షల్ పటేల్ తొలి మ్యాచ్ లో అదరగొట్టారు. తమదైన పేస్ తో చెలరేగిపోయారు. దీంతో బౌలింగ్ మరింత బలంగా మారడం టీమ్ మేనేజ్ మెంట్ కు సంతోషాన్ని ఇస్తోంది.
అటు బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వారి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రపంచకప్‌కు ముందు అతని సూపర్ ఫామ్ భారత్ కు మేజర్ అడ్వాంటేజ్. మిగిలిన బ్యాటర్లకు తొలి మ్యాచ్ లో ఛాన్స్ రాలేదు. దీంతో అన్ని విభాగాల్లోనూ భారత్ మంచి ఫామ్ లో ఉండడంతో సీరీస్ విజయంపై అంచనాలున్నాయి. మరోవైపు భారత గడ్డపై మంచి రికార్డు ఉన్న దక్షిణాఫ్రికా తిరువనంతపురంలో పేలవమైన ఆటతీరుతో డీలాపడింది.
సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్ పరంగా ఇబ్బందులు లేకపోయినా… బ్యాటింగ్ సఫారీలకు ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలో భారత్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2017లో ఆస్ట్రేలియా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. 2020లో భారత్, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ్టి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు పడే అవకాశం ఉంది.