Rohit Sharma:హిట్‌మ్యాన్ వరల్డ్ రికార్డ్

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. భారీస్కోరు సాధించిన రోహిత్‌సేన ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌ను దెబ్బతీసి 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.

  • Written By:
  • Publish Date - July 8, 2022 / 05:10 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. భారీస్కోరు సాధించిన రోహిత్‌సేన ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌ను దెబ్బతీసి 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ అరుదైన ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. టీ ట్వంటీ క్రికెట్‌లో వరుసగా 13 విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు.

సారథిగా పూర్తిస్థాయి బాధ్యతలు అందుకున్న తర్వాత ఇదే తొలి విజయం అయినప్పటకీ.. పలు సందర్భాల్లో కోహ్లీ లేనప్పుడు కెప్టెన్సీ చేశాడు. కెప్టెన్‌గా రోహిత్ విన్నింగ్ రికార్డ్ 2019లో బంగ్లాదేశ్‌పై మొదలైంది. బంగ్లాపై 2, తర్వాత న్యూజిలాండ్‌పై వరుసగా 4 మ్యాచ్‌లలో గెలిపించాడు. అనంతరం విండీస్‌పై హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకపై వరుసగా మూడు మ్యాచ్‌లోనూ జట్టును విజయపథంలో నడిపించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ అందుకున్న రోహిత్ వరుసగా 13 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్‌ ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్‌లోనూ ఓటమి రుచి చూడలేదంటే అతని జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును కూడా రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.

టీ ట్వంటీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన కోహ్లీ రికార్డును అధిగమించాడు.
ఐదు ఫోర్లతో 24 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ 13 పరుగుల స్కోరు దగ్గర ఉన్నప్పుడు ఈ మైలురాయి అందుకున్నాడు. కోహ్లి 30 ఇన్నింగ్స్‌లో 1000 రన్స్‌ సాధించగా…. పాక్ క్రికెటర్ బాబర్‌ 24 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. ఇక ఇప్పుడు రోహిత్‌శర్మ తన 29వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకున్నాడు. ఇదిలా ఉంటే తొలి టీ ట్వంటీలో హార్థిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘనవిజయం సాధించింది. హాఫ్ సెంచరీ చేసిన పాండ్యా బంతితోనూ రాణించి 4 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది.