భారత్,ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుండి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ పై భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో రోహిత్ భారీ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికే తన ఖాతాలో ఎన్నో రికార్డుల్ని నమోదు చేసిన రోహిత్ కొంత గ్యాప్ తర్వాత మరో మైలు రాయిని చేరుకోనున్నాడు.
ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ కేవలం 134 పరుగులు చేస్తే తన ఖాతాలో భారీ రికార్డు నమోదవుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. రోహిత్ నెక్స్ట్ 19 వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 134 పరుగులు చేస్తే, వన్డే ఫార్మాట్‌లో 11,000 పరుగులు సాధించిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా అవతరిస్తాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనే రోహిత్ ఈ రికార్డు సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 222 మ్యాచ్‌ల్లో ఈ సంఖ్యను చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 276 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మూడవ స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 286 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 288 వన్డే మ్యాచ్‌ల్లో 11 వేల పరుగులను సాధించాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 265 వన్డేల్లో 92.44 స్ట్రైక్ రేట్ మరియు 49.17 సగటుతో 10,886 పరుగులు చేశాడు, ఇందులో 31 సెంచరీలు మరియు 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్‌మన్ రోహిత్. వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 264 పరుగులు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.