Site icon HashtagU Telugu

ICC Womens World Cup 2025 : రోహిత్ శర్మ ఎమోషనల్..మ్యాచ్ మొత్తం అయ్యేవరకూ గ్రౌండ్‌లోనే..!

Icc Womens World Cup 2025

Icc Womens World Cup 2025

భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. నవి ముంబైలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను భారత జట్టు కైవసం చేసుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూస్తూ, భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కన్నీటితో చప్పట్లు కొట్టడం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. ఇది ఒక ఛాంపియన్ నుంచి మరో ఛాంపియన్‌కు దక్కిన గౌరవం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

భారత క్రికెట్ చరిత్రలోనే మరచిపోలేని రాత్రి అది. నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఉమెన్ ఇన్ బ్లూ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఆ సమయంలో స్టేడియంలో ప్రేక్షకుల మధ్య కనిపించిన ఓ దృశ్యం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. భారత జట్టు స్టార్ బ్యాటర్, ఐసీసీ నెంబర్ వన్ వన్డే బ్యాటర్ రోహిత్ శర్మ భావోద్వేగాలతో చప్పట్లు కొడుతూ కనిపించాడు.

2024 పురుషుల టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టుకు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ సాయంత్రం ప్రత్యేక అతిథిగా స్టేడియంలో హాజరయ్యాడు. మ్యాచ్ మొత్తం పూర్తయ్యే వరకూ ఆయన కళ్లు మైదానంపైనే నిలిచిపోయాయి. షఫాలీ వర్మ అద్భుత బౌండరీలు కొట్టినప్పుడు చిరునవ్వులు చిందించాడు, దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడినప్పుడు ప్రశంసగా తల ఊపాడు. కానీ చివరి క్షణంలో దీప్తి ఆఖరి వికెట్ పడగొట్టగానే రోహిత్ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ క్షణంలో ఆయన కళ్లలో తడి కనిపించింది. అది ఒక ఛాంపియన్ నుంచి మరో ఛాంపియన్‌కు ఇచ్చిన గౌరవప్రదమైన నివాళి.

మిలియన్ల మంది అభిమానులకు అది ఒక గూస్‌బంప్స్ క్షణం. భారత క్రికెట్‌ను మరోసారి ప్రపంచ శిఖరాగ్రానికి తీసుకెళ్లిన రోహిత్, ఇప్పుడు భారత మహిళా జట్టు అదే కలను సాకారం చేస్తూ చూడడం.. ఎమోషనల్‌గా మారిపోకుండా ఉండలేకపోయాడు. సోషల్ మీడియాలో “రోహిత్‌కు మాత్రమే తెలుసు.. ఒక ఛాంపియన్, మరొక ఛాంపియన్‌ను ఎలా అభినందించాలో” అంటూ పోస్టులు చేస్తున్నారు.

ఈ విజయం కేవలం హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకే కాదు, మొత్తం భారత క్రికెట్‌కి ఒక గర్వకారణం. 2005, 2017లో వచ్చిన చేదు అనుభవాల తరువాత 2025లో లభించిన ఈ విజయం వారి పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. నవి ముంబై వెలుగుల్లో రోహిత్ శర్మ కన్నీటి తడితో చప్పట్లు కొడుతూ నిలబడ్డ ఆ క్షణం భారత క్రికెట్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

రోహిత్ శర్మ డీవై పాటిల్ స్టేడియంలో నేరుగా మ్యాచ్‌ని వీక్షిస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్లు అక్కడ టీవీలకు అతుక్కుపోయి మరీ మ్యాచ్‌ను చూశారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మిగతా ఆటగాళ్లంతా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడిన భారత మహిళా క్రికెటర్లకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version