T20 World Cup: అభిమానుల కరువు తీరింది… టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం నుంచి హిట్ మ్యాన్ మెరుపులు లేవనుకుంటున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. ఆస్ట్రేలియాతో సూపర్ 8 రౌండ్ చివరి మ్యాచ్ లో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మెగా టోర్నీలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కదా హిట్ మ్యాన్ అంటే అని ఫ్యాన్స్ సంబరబడిన వేళ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో సత్తా చాటుతున్న ఆసీస్ పేసర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో అయితే ఏకంగా నాలుగు భారీ సిక్సర్లు బాదేశాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు , ఒక ఫోర్ , వైడ్ తో కలిపి 29 పరుగులు వచ్చాయి. రోహిత్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ డకౌటై నిరాశపరిచినా… హిట్ మ్యాన్ తన హిట్టింగ్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు.
హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన రోహిత్ ను కట్టడి చేయలేక ఆసీస్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. 8 పరుగుల తేడాలో సెంచరీ చేజార్చుకున్న హిట్ మ్యాన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో 200 సిక్సర్లు బాదిన బ్యాటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా హిట్ మ్యాన్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 31, శివమ్ దూబే 28, పాండ్యా 27 పరుగులతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , కమ్మిన్స్ , జంపా , స్టోయినిస్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
Also Read: T20 World Cup: రో”హిట్”…సూపర్ హిట్ ఆసీస్ ముందు భారీ టార్గెట్