Site icon HashtagU Telugu

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ముందున్న రికార్డులు ఇవే..!

Imgonline Com Ua Resize Tym2ax5wcuu4

Imgonline Com Ua Resize Tym2ax5wcuu4

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2022 సమరం నేటి నుంచి మొదలైంది. నేటి నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇక అసలు సమరం అంటే.. సూపర్- 12 మ్యాచులు అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

అత్యధిక సిక్సర్లు: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 31 సిక్సర్లు బాదాడు. మరో మూడు సిక్స్‌లు బాదితే ఈ టోర్నీలో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ జాబితాలో ప్రస్తతం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (33 సిక్స్‌లు) టాప్‌లో ఉన్నాడు.

అత్యధిక పరుగులు: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనేపై అత్యధిక పరుగుల చేసిన రికార్డు ఉంది. ఐదు ప్రపంచకప్‌లు ఆడి.. 1016 పరుగులు చేశాడు జయవర్ధనే. ఈ టీ20 ప్రపంచకప్ లో రోహిత్ మరో 169 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్సమెన్ గా నిలవనున్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం రోహిత్‌ (847 పరుగులతో) 4వ స్థానంలో ఉన్నాడు.

సెంచరీ చేస్తే: 2010 ప్రపంచకప్‌లో క్రిస్‌ గేల్‌ విండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ పొట్టి టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఈ టీ20 ప్రపంచకప్ లో రోహిత్‌ శర్మ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.

అత్యధిక మ్యాచ్‌లు: రోహిత్‌ శర్మ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో 33 మ్యాచ్‌లు ఆడాడు. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్ దిల్షాన్‌ (35) అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్‌ బ్రావో(34), షోయబ్‌ మాలిక్‌ (34), ఎంఎస్‌ ధోనీ (33), క్రిస్‌ గేల్‌ (33), రోహిత్ కంటే ముందున్నారు. ఈ టీ20 ప్రపంచకప్ ద్వారా రోహిత్‌ అగ్రస్థానానికి చేరుకోనున్నాడు