Site icon HashtagU Telugu

Rohit Sharma: ఆసీస్‌తో మూడో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ పేరిట న‌మోదైన రికార్డులీవే!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: భారత్-ఆస్ట్రేలియా మధ్య జ‌రిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ అక్టోబర్ 25న సిడ్నీలో జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడి అద్భుతంగా ప్రదర్శన చేసింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి తన పేరిట కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు రోహిత్ కొత్త సిక్సర్ కింగ్‌గా మారాడు.

రోహిత్ శర్మ కొత్త సిక్సర్ కింగ్

‘సేన’ (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో విదేశీ ఆటగాడిగా అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ విషయంలో అతను క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టాడు. క్రిస్ గేల్ 87 ఇన్నింగ్స్‌లలో 92 సిక్సర్లు కొట్టగా రోహిత్ శర్మ 86 ఇన్నింగ్స్‌లలో 93 సిక్సర్లు కొట్టి తన పేరిట రికార్డు నమోదు చేసుకున్నాడు. ఈ జాబితాలో సనత్ జయసూర్య 89 సిక్సర్లతో మూడో స్థానంలో, షాహిద్ అఫ్రిది 83 సిక్సర్లతో నాలుగో స్థానంలో, వివియన్ రిచర్డ్స్ 59 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 125 బంతుల్లో 121పరుగులు చేశాడు.

రోహిత్ శర్మకు క్యాచ్‌ల సెంచరీ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా అద్భుతమైన బౌలింగ్ చేసి కంగారూ జట్టును 46.4 ఓవర్లలో 236 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ఫీల్డింగ్‌ను ప్రదర్శించి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను పరుగుల కోసం కష్టపడేలా చేశారు. ఈ సమయంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌లో ఒక ప్రత్యేకమైన శతకాన్ని సాధించాడు.

రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు ముందు ఫీల్డింగ్‌లో తన సత్తా చూపించాడు. అతను ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల క్యాచ్‌లను పట్టుకున్నాడు. ముందుగా హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్లిప్‌లో మిచెల్ ఓవెన్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో షార్ట్ మిడ్‌వికెట్‌లో నాథన్ ఎల్లిస్ క్యాచ్ తీసుకున్నాడు. నాథన్ క్యాచ్ పట్టుకోవడంతో రోహిత్ వన్డే క్రికెట్‌లో తన 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు.

Also Read: LIC : అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై ఎల్ఐసీ సంచలనం..!

దీంతో భారత్ తరఫున 100 క్యాచ్‌లు అందుకున్న 7వ ఫీల్డర్‌గా అతను నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సురేష్ రైనా, సౌరవ్ గంగూలీ ఈ ఘనత సాధించారు. అలాగే వన్డేల్లో 100 క్యాచ్‌లు పట్టిన సౌరవ్ గంగూలీ రికార్డును కూడా హిట్‌మ్యాన్ సమం చేశాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు (164) అందుకున్న రికార్డు కోహ్లీ పేరిట ఉంది.

ఈ విషయంలో విరాట్ కోహ్లీ నంబర్-1

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. దీనితో అతను ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో కోహ్లీ ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ బోథమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ పేరిట ఇప్పుడు మొత్తం 38 క్యాచ్‌లు ఉన్నాయి. ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియాలో మొత్తం 37 క్యాచ్‌లు పట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన కార్ల్ హూపర్ 33 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో భారత్ తరఫున ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు

Exit mobile version