Rohit Sharma: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో తన టైటిల్ నిరీక్షణకు తెరదించాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఆ ఫ్రాంచైజీ ఒక ప్రత్యేక సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ముంబై రికార్డ్ బ్రేకింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 10, 2011న ముంబై ఇండియన్స్ (MI) తరపున అరంగేట్రం చేసిన రోహిత్.. ఇప్పుడు ఈ జట్టుతో తన 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
రోహిత్‌కు హార్దిక్ పాండ్యా గౌరవం
ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహచర ఆటగాడు రోహిత్‌కు ప్రత్యేక గౌరవాన్ని అందించారు. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో హార్దిక్ ఇలా అన్నారు. భాయ్, 15 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ఈ ఫ్రాంచైజీని అద్భుతంగా నడిపించినందుకు ధన్యవాదాలు. నేను మీ నాయకత్వంలోనే డెబ్యూ చేశాను. బుమ్రా, ఇతర ఆటగాళ్లు కూడా మీ హయాంలోనే జట్టులోకి వచ్చారు అని పేర్కొన్నాడు.
Also Read: హోర్ముజ్ జలసంధి.. అమెరికా సంచలన వాదన!
Moment hai bhai, moment hai! 💙 pic.twitter.com/FjAQfOMofY
— Mumbai Indians (@mipaltan) April 11, 2026
హార్దిక్ ఇంకా మాట్లాడుతూ.. ఈ ఫ్రాంచైజీకి, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది ఆటగాళ్లను ఇన్‌స్పైర్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు కేవలం ఒక లీడర్‌గానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ, ఓపెన్ మైండెడ్‌గా ఉంటూ జట్టును ముందుండి నడిపించారు. గత కొన్నేళ్లుగా మీరు చేసిన కృషికి చాలా థాంక్స్ అని పేర్కొన్నారు.
15 ఏళ్ల అద్భుత ప్రయాణం
38 ఏళ్ల రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో తన జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఇద్దరు కెప్టెన్లలో ఒకరు. 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోహిత్ 2011లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ కోసం 230 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 5994 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) టైటిల్ నెగ్గడంలో రోహిత్ కెప్టెన్సీ కీలకంగా నిలిచింది. అలాగే 2011, 2013లో ఛాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఒకవేళ రోహిత్ ఈ సీజన్ (2026)లో ఐపీఎల్ టైటిల్ గెలిస్తే టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలుస్తాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 39.33 సగటుతో, 168.57 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేశాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది.
