Virendra Sehwag: సెహ్వాగ్ కామెంట్స్ తో స్ప్లిట్ కెప్టెన్సీ పై చర్చ

భారత క్రికెట్ లో ఫార్మాట్ కో కెప్టెన్ ఐడియా సక్సెస్ కాదని చాలా కాలంగా వినిపిస్తున్న అభిప్రాయం.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 02:25 PM IST

భారత క్రికెట్ లో ఫార్మాట్ కో కెప్టెన్ ఐడియా సక్సెస్ కాదని చాలా కాలంగా వినిపిస్తున్న అభిప్రాయం. అందుకే బీసీసీఐ కూడా ఈ ప్రయోగానికి దూరంగా ఉంటోంది. గత ఏడాది విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత పలు ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఒకే కెప్టెన్ ఫార్ములాకే ఓటు వేసి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. అయితే తాజాగా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్ తో స్ప్లిట్ కెప్టెన్సీ గురించి మళ్లీ చర్చ మొదలయింది. అన్ని ఫార్మాట్లలోనూ ఒకే కెప్టెన్‌ అన్న కాన్సెప్ట్‌కు విరుద్ధంగా టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించాలని సెహ్వాగ్ అంటున్నాడు. రోహిత్‌పై పనిభారం తగ్గాలంటే అదే సరైన నిర్ణయమని స్పష్టం చేస్తున్నాడు. అప్పుడే వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లలో మరింత మెరుగ్గా రాణించగలడని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.
రోహిత్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో గతంలోనే పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు సెహ్వాగ్‌ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. టీ20 కెప్టెన్సీని మరొకరికి అప్పగించాలన్న ఆలోచన ఇండియన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉంటే వెంటనే రోహిత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సూచించాడు.
ఇలా చేస్తే అతనికి పనిభారాన్ని మేనేజ్‌ చేసుకునే అవకాశం దక్కుతుందన్నాడు. ఇక టీ20లకు మరో కెప్టెన్‌ను నియమిస్తే.. రోహిత్‌కు తరచూ ఈ ఫార్మాట్‌ నుంచి బ్రేక్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంటుందనీ, దీనివల్ల అతడు వన్డేలు, టెస్టులకు మరింత ఉత్సాహంగా కెప్టెన్సీ వహిస్తాడని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. కాగా పలు విదేశీ జట్లలో ఫార్మాట్ కో కెప్టెన్ ఫార్ములా ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే భారత్ క్రికెట్ లో స్ప్లిట్ కెప్టెన్సీ విజయవంతం కాదని చాలా మంది మాజీ ఆటగాళ్ళు విశ్లేషించారు. ఈ నిర్ణయం తీసుకుంటే జట్టులో గ్రూపులు తయారయ్యే ప్రమాదం ఉంటుందని అభిప్రాయ పడ్డారు.