Rohit Sharma:పాక్ బౌలింగ్ సవాలే : రోహిత్ శర్మ

టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ వేటను భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆరంభించనుంది. ఆదివారం మెల్ బోర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Babar Azam

Rohit and Babar Azam

టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ వేటను భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆరంభించనుంది. ఆదివారం మెల్ బోర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పలు అంశాలపై మాట్లాడాడు. పాక్ తో మ్యాచ్ అంటే ఒత్తిడి సహజమేనని రోహిత్ చెప్పాడు. పాక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం సవాలే అని అంగీకరించాడు. అదే సమయంలో భారత బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలంగా ఉందన్న విషయం గుర్తు చేశాడు. రెండు బలమైన జట్లు ఎదుర్కొన్నప్పుడు ఆ పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. పాక్‌ బౌలింగ్‌ సవాల్‌ కోసం తమ బ్యాటర్లు రెఢీగా ఉన్నట్లు కూడా రోహిత్‌ చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ సారి ఐసీసీ
ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. గత తొమ్మిదేళ్లుగా భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవకపోవడం నిరాశకు గురిచేసిందని.. ఈసారి ఆ లోటు తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపాడు. హిట్ మ్యాన్ కెప్టెన్‌ హోదాలో తొలిసారి వరల్డ్‌కప్‌ ఆడనున్నాడు.
జట్టు రాతను మార్చే అవకాశం ఇప్పుడు తమ చేతుల్లో ఉందన్న రోహిత్ ఈ అంశాలు ఒత్తిడిని పెంచలేవనీ చెప్పుకొచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా కష్టపడతామని ధీమా వ్యక్తం చేశాడు.
నిజానికి తాము గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా ఆడుతున్నామనీ, కొన్ని పొరపాట్ల వల్ల కీలక సమయాల్లో ఓటమితో వెనుదిరగాల్సి వచ్చిందన్నాడు. ఐసీసీ ఈవెంట్‌లో అగ్రస్థాయికి చేరుకునే సత్తా భారత్ జట్టుకు ఉందనీ రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

 

  Last Updated: 22 Oct 2022, 01:29 PM IST