ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్‌.. రోహిత్ శర్మదే అగ్రస్థానం!

శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజమ్ ర్యాంకింగ్స్‌లో దిగజారడానికి వారి పేలవమైన ప్రదర్శన కారణమని చెప్పవచ్చు. శుభ్‌మన్ గిల్ తన చివరి మూడు వన్డే మ్యాచ్‌లలో అతను వరుసగా 24, 9, 10 పరుగులు మాత్రమే చేశాడు.

Published By: HashtagU Telugu Desk
ICC Rankings

ICC Rankings

ICC Rankings: ఐసీసీ (ICC) బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ (ICC Rankings) అప్‌డేట్‌లో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, పాకిస్తాన్ ఆట‌గాడు బాబర్ ఆజమ్ నష్టపోయారు. అయితే టీమ్ ఇండియా వ‌న్డే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన జోరును కొనసాగిస్తూ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెం. 1 స్థానంలో నిలవడం విశేషం. గిల్, బాబర్‌ను న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ అధిగమించారు. టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు.

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌

ప్రస్తుత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో, ఇబ్రహీం జద్రాన్ రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి 2 మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించ‌టంతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 781 పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ 746 పాయింట్లతో ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నారు. డారిల్ మిచెల్ దూసుకురావడంతో శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజమ్ చెరో ఒక్కో స్థానం నష్టపోయారు. శుభ్‌మన్ గిల్ 745 పాయింట్లతో మూడో స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయారు. ఆజమ్ 728 పాయింట్లతో నాల్గవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయారు.

Also Read: Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

టెస్ట్- టీ20 ర్యాంకింగ్స్

టెస్ట్, టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం. 1 బ్యాటర్‌గా కొనసాగుతున్నారు. టీమిండియా ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ‌ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం. 1 స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

గిల్‌, బాబర్ చివరి మూడు వన్డే మ్యాచ్‌ల ప్రదర్శన

శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజమ్ ర్యాంకింగ్స్‌లో దిగజారడానికి వారి పేలవమైన ప్రదర్శన కారణమని చెప్పవచ్చు. శుభ్‌మన్ గిల్ తన చివరి మూడు వన్డే మ్యాచ్‌లలో అతను వరుసగా 24, 9, 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ లేదా సెంచరీ కూడా నమోదు చేయలేదు. బాబర్ ఆజమ్ చివరి మూడు వన్డే ఇన్నింగ్స్‌లలో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగులు, అంతకుముందు వెస్టిండీస్‌పై 9, 0 పరుగులు మాత్రమే చేశారు.

  Last Updated: 05 Nov 2025, 05:16 PM IST