Site icon HashtagU Telugu

Rohit Sharma: సెంచరీ కొట్టిన రోహిత్.. వన్డే ఓపెనర్ గా రికార్డ్!

Rohit Sharma Record

Rohit Sharma Record

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ఓపెనర్ గా దశాబ్దకాలాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు. రోహిత్ శర్మ…క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు పలు రకాలుగా అసమానసేవలు అందిస్తున్న మొనగాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్ గా, ఓపెనర్ స్థానం నుంచి భారత కెప్టెన్ స్థాయికి ఎదిగిన రోహిత్ ..వన్జేలలో భారత ఓపెనర్ గా దశాబ్దకాలన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నాడు.

2013 నుంచి 2023 వరకూ.. ముంబైలో ఓ తెలుగుమూలాలున్న దిగువ మధ్యతరగతిలో పుట్టి..జూనియర్ స్థాయిలోనే అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ వయసుతో పాటు తన ప్రతిభను, స్థాయిని పెంచుకొంటూ వచ్చాడు. 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలువడంలో ప్రధానపాత్ర వహించిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. మిడిలార్డర్ బ్యాటర్ గా తన కెరియర్ ప్రారంభించిన రోహిత్ కు జింబాబ్వే పైన ఒకే సిరీస్ లో రెండుశతకాలు సాధించిన రికార్డు ఉంది. ఆ తర్వాత 18 మాసాలపాటు వరుసగా విఫలమవుతూ వచ్చాడు. 2011 ప్రపంచకప్ లో సైతం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు.

ధోనీ సలహాతో.. రోహిత్ శర్మలోని అపారప్రతిభను గుర్తించిన అప్పటి కెప్టెన్ ధోనీ…ఓపెనర్ గా ఆడమంటూ సలహా ఇచ్చాడు. 2011 జనవరి లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోవన్డేలో తొలిసారిగా ఓపెనర్ గా దిగినా 23 పరుగులకే అవుటయ్యాడు. అయితే..2013 జనవరి 23న మొహాలీ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ ఓపెనర్ గా 83 పరుగుల స్కోరుతో తన జైత్రయాత్ర మొదలుపెట్టాడు. ఆ తర్వాత నుంచి రోహిత్ మరి వెనుదిరిగి చూసింది లేదు.భారత్ తరపున వన్డేలలో పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.