Rohit Fans Emotional: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Fans Emotional) రెండో టెస్టులో పునరాగమనానికి సిద్ధమయ్యాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ 176 బంతుల్లో 77 పరుగులు చేసి టీమిండియాకు గొప్ప ఆరంభాన్నిచ్చాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తొలి వికెట్‌కు 201 పరుగులు జోడించారు. ఇప్పుడు రోహిత్ శర్మ ఎంట్రీతో ఓపెనింగ్ జోడీకి ఢోకా ఉండదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రోహిత్ ఓపెనింగ్ చేయకపోతే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. సాధారణంగా విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడతాడు. శుభ్‌మన్ గిల్ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే రెండో టెస్టులో రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తే 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగవచ్చు. కాగా రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని రాహుల్ కోసం త్యాగం చేస్తున్నాడని సోషల్ మీడియాలో వేలాది పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. జట్టు విజయమే ముఖ్యమని, తానెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చివరికి తనకిష్టమైన ఓపెనింగ్ స్థానాన్ని కూడా త్యాగం చేస్తున్నాడని అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
Also Read: India Vote : పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐరాస తీర్మానం.. అనుకూలంగా భారత్ ఓటు
టెస్టులో ఓపెనింగ్ సహా ఇతర బ్యాటింగ్ స్థానాల్లో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉందొ ఒకసారి చూద్దాం. 37 టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ ఓపెనింగ్ కు దిగాడు. ఈ సమయంలో 44.01 సగటుతో 2685 పరుగులు చేశాడు.టెస్టుల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ 9 సెంచరీలు కూడా సాధించాడు. 4 మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 21.40 సగటుతో 53 పరుగులు చేశాడు. 4వ స్థానంలో రోహిత్ 1 మ్యాచ్ ఆడి 4 పరుగులు మాత్రమే చేశాడు. తన టెస్ట్ కెరీర్ ప్రారంభంలో రోహిత్ శర్మ 5-6 నంబర్‌లో బ్యాటింగ్ చేసేవాడు.
5వ స్థానంలో 10 టెస్టులు ఆడి 29.13 సగటుతో 437 పరుగులు చేశాడు. అలాగే, 6వ స్థానంలో 16 టెస్టుల్లో 54.57 సగటుతో 1037 పరుగులు చేశాడు. ఈ సమయంలో 3 సెంచరీలు సాధించాడు. కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 111 ఇన్నింగ్స్‌లలో 4270 పరుగులు చేశాడు. టెస్టుల్లో రోహిత్ సగటు 42.27 మరియు స్ట్రైక్ రేట్ 57.48. టెస్టుల్లో 18 హాఫ్ సెంచరీలు, 12 సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ అత్యధిక స్కోరు 212 పరుగులు. అంతేకాదు రోహిత్ టెస్టులో 2 వికెట్లు కూడా తీశాడు.