Rohan Boppanna – Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్ స్లామ్ లో అదరగొట్టింది. తన పార్ట్ నర్ రోహన్ బొపన్నతో కలిసి గ్రౌండ్ లో రెచ్చిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్న- సానియా మీర్జా జోడి సెమీస్ లో డిసిరే క్రావ్జిక్- నీల్ స్కుప్స్కి జోడితో తలపడింది. ఈ మ్యాచులో రోహన్ బొపన్న- సానియా మీర్జా జోడి డిసిరే క్రావ్జిక్- నీల్ స్కుప్స్కి జోడిపై 7-6 (5), 6-7 (5), 10-6 తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ ఆధ్యంతం ఎంతో రసవత్తరంగా సాగగా.. మొదటి రౌండ్ లో రోహన్ బొపన్న- సానియా మీర్జా జోడి ఆధిపత్యాన్ని సాధిస్తే, రెండో రౌండ్ లో డిసిరే క్రావ్జిక్- నీల్ స్కుప్స్కి జోడి దూసుకెళ్లింది. ఇక కీలకమైన మూడో రౌండ్ లో రోహన్ బొపన్న- సానియా మీర్జాలు తమ అనుభవాన్ని రంగరించి.. మ్యాచులో విజయాన్ని సాధించింది.
టెన్నిస్ స్టార్ గా అంతర్జాతీయ వేదిక మీద ఎన్నో సిరీస్ లను కైవసం చేసుకున్న సానియా మీర్జా.. తన ఖాతాలో ఎన్నో అవార్డులను వేసుకుంది. 36 ఏళ్ల సానియా మీర్జా, 42 ఏల్ల రోహన్ బొపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అదరగొట్టేసింది. దీంతో సానియా మీర్జా- రోహన్ బొపన్నల జోడి ఫైనల్ కు చేరింది. గెలుపుకు వయసుతో సంబంధం లేదని రోహన్ బొపన్న- సానియా మీర్జా జోడి నిరూపించింది.
సానియా మీర్జా మాట్లాడుతూ.. “ఇదొక అద్భుతమైన మ్యాచ్. నా చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరులో రోహన్తో కలిసి ఆడటం బాగుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు.. నా మిక్స్ డ్ డబుల్ పార్టనర్ రోహన్. ఇప్పుడు నా వయస్సు 36.. అతడికి 42 ఏళ్లు.. అయినా మేం ఇప్పటికీ ఆడుతున్నాం. ఆటగాళ్లుగా మా మధ్య మంచి బంధం ఉంది. మమ్మల్ని మేం నిరూపించుకొనేందుకు మాకు ఇదొక మంచి అవకాశం. ఇప్పటి వరకు మిక్స్డ్ డబుల్ పోటీల్లో బాగానే ఆడుతున్నాం. భారత్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన చాలామంది నాకు మద్దతుగా నిలిచారు’ అని సానియా వ్యాఖ్యానించింది.