Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Shaheen Afridi

Shaheen Afridi

Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో పెద్ద నిర్ణయం తీసుకుంటూ వన్డే జట్టు కెప్టెన్సీ (Pakistan ODI Captain) నుంచి కూడా మహ్మద్ రిజ్వాన్‌ను తొలగించింది. దీంతో ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్‌లు ఉన్నారు. రిజ్వాన్ కంటే ముందు బాబర్ ఆజం వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉండేవారు. అయితే పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇప్పుడు షాహీన్ షా అఫ్రిదిని పాకిస్థాన్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఇతను గతంలో టీ20 జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఈ సిరీస్‌తో కెప్టెన్సీ ఆరంభం

పాకిస్థాన్ తమ సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే షాహీన్ అఫ్రిది పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. నిన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా, వన్డే జట్టు కెప్టెన్ షాహీన్ అఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్‌గా ఉన్నారు.

Also Read: Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ వన్డే జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని తప్పించి మహ్మద్ రిజ్వాన్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించారు. కానీ మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో కూడా పాకిస్థాన్ జట్టు ప్రదర్శన మెరుగుపడలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాత వెస్టిండీస్ చేతిలో పాకిస్థాన్ వన్డే సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ఇక న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. దీని కారణంగానే పీసీబీ ఇప్పుడు రిజ్వాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని నిర్ణయించింది.

పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించారు. దీనిపై పీసీబీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో షాహీన్ అఫ్రిదిని పాకిస్థాన్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది.

  Last Updated: 21 Oct 2025, 08:40 AM IST