India Loses To Pak: సూపర్-4లో భారత్ పై పాక్ విజయం

ఆసియాకప్ లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. సూపర్ 4 స్టేజ్ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైంది.

  • Written By:
  • Updated On - September 5, 2022 / 12:15 AM IST

ఆసియాకప్ లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. సూపర్ 4 స్టేజ్ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. బ్యాటింగ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించినా…. బౌలర్లు విఫలమవడంతో పాక్ విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 5.1 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. రోహిత్ , రాహుల్ దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలో స్కోర్ ఫస్ట్ గేర్ లో సాగింది. అయితే వీరిద్దరూ వెంటనే వెంటనే ఔటయ్యారు. రోహిత్ 28 , రాహుల్ 24 రన్స్ చేశారు. ఓపెనర్లు ఔటైనా వారిచ్చిన ఆరంభంతో భారత్ భారీస్కోర్ చేస్తుందనిపించగా.. వరుస వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్‌ 13, పంత్‌ 14, హార్దిక్‌ పాండ్యా 0, దీపక్‌ హుడా 16 విఫలమయ్యారు. అయితే కోహ్లీ నిలదొక్కుకోవడంతో భారత్ మంచి స్కోరే చేసింది. చాలా రోజుల తర్వాత పూర్తి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 44 బంతుల్లో 60 పరుగులు చేసి కోహ్లీ రనౌటవగా.. చివర్లో రవి బిష్ణోయ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో భారత్ స్కోర్ 180 దాటింది. ఒక దశలో 200 చేస్తుందనుకున్న భారత్ వరుస వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీసాడు.

181 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో పాకిస్థాన్ కూడా ధాటిగా ఆడింది. బాబర్ అజామ్, ఫఖర్ జమాన్ త్వరగానే ఔటైనా…మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్ భారత బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్ చేశారు. దీంతో పాక్ స్కోర్ వేగం పుంజుకుంది. వీరిద్దరూ మూడో వికెట్ కు 73 పరుగులు జోడించారు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ధాటిగా ఆడారు. అయితే హార్థిక్ , భువనేశ్వర్ వీరిద్దరినీ ఔట్ చేయడంతో మ్యాచ్ ఆసక్తకరంగా మారింది. రిజ్వాన్ 51 బంతుల్లో 71 పరుగులు చేయగా.. నవాజ్ 20 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ పేలవమైన బౌలింగ్ భారత్ ఓటమికి కారణమైంది. తొలి 3 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసిన భువి 19వ ఓవర్ లో గాడి తప్పాడు. రెండు వైడ్లు, రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో మొత్తం 19 పరుగులు ఇచ్చేశాడు. అయితే చివరి ఓవర్లో విజయం కోసం 7 రన్స్ చేయాల్సి ఉండగా.. అర్షదీప్ సింగ్ తొలి బంతికి సింగిల్, రెండో బంతికి ఫోర్ ఇచ్చాడు. మూడో బంతికి పరుగులేమి ఇవ్వని అర్షదీప్ సింగ్ నాలుగో బంతికి అసిఫ్ అలీని ఔట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. రెండు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో ఇఫ్తికర్ అహ్మద్ పాక్ ను గెలిపించాడు.

స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ పడడంతో చివరి ఓవర్ కు రింగ్ బయట ముగ్గురే ఫీల్డర్లు ఉండడం కూడా భారత్ అవకాశాలను దెబ్బతీసింది.