Site icon HashtagU Telugu

RR crushes RCB: బౌలర్ల జోరుతో రాజస్థాన్ విజయం

Rajasthan Royals

Rajasthan Royals

ప్లే ఆఫ్ అవకాశాలు ఊరిస్తున్న వేళ కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. బ్యాట్ తో పెద్దగా రాణించకున్నా బౌలర్ల జోరుతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవగా.. ఆర్సీబీ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. సిక్సర్ కొట్టి ఊపుమీద కనిపించిన పడిక్కల్ సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కాసేపటికే సెంచరీల హీరో బట్లర్ కూడా ఔటవడంతో రాయల్స్ ఒత్తిడిలో పడినట్టు కనిపించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సంజూ శాంసన్ భారీ సిక్సర్లతో రన్‌రేట్ తగ్గకుండా ఆడాడు. అటు యువ ప్లేయర్ రియాన్ పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 పరుగులు చేసి అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పరాగ్ ఆడకుంటే ఆ జట్టు స్కోర్ 120 కూడా దాటేది కాదు. చివరకు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లతో రాణించారు. ముఖ్యంగా హ్యాజిల్ వుడ్ తనదైన బౌలింగ్ తో రాజస్థాన్ ను కట్టడి చేశాడు.

భారీ టార్గెట్ కాకపోవడంతో సునాయాసంగా గెలుస్తుందనుకున్న బెంగళూరు ఆరంభం నుంచే తడబడింది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. కాసేపటికే డుప్లెసిస్ 23 రన్స్ కే ఔటవగా… మాక్స్ వెల్ డకౌటయ్యాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ లలో రాణించిన షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ లపై అంచనాలుండగా.. ఈ సారి మాత్రం వీరిద్దరూ నిరాశపరిచారు. కార్తీక్ అనూహ్యంగా రనౌటవడం బెంగళూరు విజయాకాశాలను దెబ్బతీసింది. హసరంగా రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్ కు 115 పరుగుల దగ్గర తెరపడింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.