Site icon HashtagU Telugu

Anderson-Tendulkar Trophy : రిషబ్ పంత్ రనౌట్ ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది – శుభ్‌మన్

Rishabh Pant

Rishabh Pant

ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) మరింత రసవత్తరంగా మారింది. లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్ట్‌ హోరాహోరీగా సాగి చివరికి ఇంగ్లాండ్ (England ) 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో తమకు అనుకూలంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. చివర్లో రవీంద్ర జడేజా (నాటౌట్ 61) ఒంటరిగా పోరాడినప్పటికీ, 112/8 స్థితిలో ఉన్న భారత్‌ను గెలిపించలేకపోయాడు.

మ్యాచ్ అనంతరం భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. రిషబ్ పంత్ రనౌట్ మ్యాచ్ మలుపు తిప్పిన కీలక సంఘటనగా పేర్కొన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో KL రాహుల్, రిషబ్ పంత్ జోడీ 141 పరుగులు జోడించి భారత్‌కు అద్భుత స్థితి కలిగించగా, లంచ్‌కు కొద్దిసేపటి ముందు KL రాహుల్‌కు శతకం పూర్తి చేయించాలనే ఉద్దేశంతో పంత్ పరుగుకు పిలవడంతో రనౌట్ అయ్యారు. బెన్ స్టోక్స్ విసిరిన కచ్చితమైన త్రో వల్ల పంత్ 74 పరుగుల వద్ద వెనుదిరిగాడు. గిల్ అయితే ఈ తప్పును KL రాహుల్‌మీద వేయకుండా, “ఇది ఒక తప్పు అంచనా మాత్రమే” అని స్పష్టంగా చెప్పారు.

Gujarat High Court : టాయిలెట్ సీట్‌పై కూర్చొని వర్చువల్ కోర్ట్‌కు హాజరైన వక్తికి భారీ జరిమానా

రిషబ్ పంత్ (Rishabh Pant) చేతికి గాయం కావడంతో రెండు ఇన్నింగ్స్‌లోనూ వికెట్ కీపింగ్‌ చేయలేదు. బుమ్రా బౌలింగ్‌లో వచ్చిన డెలివరీని అందుకునే క్రమంలో చేతిపై బలంగా తాకిన బంతి వల్ల పంత్ దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. అయితే గిల్ మీడియాతో మాట్లాడుతూ, “పంత్ స్కాన్లు చేయించుకున్నాడు, పెద్దగా సమస్య ఏమీ లేదు. నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడు” అని తెలిపారు.

ఈ టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు ఒకే స్కోరు – 387 పరుగులు నమోదు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను 192 పరుగులకు కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీసి మెరిశాడు. కానీ 193 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. చివర్లో జడేజా, బుమ్రా, సిరాజ్ పోరాడినప్పటికీ, విజయం భారత చేతుల నుంచి జారిపోయింది. ఇప్పుడు సిరీస్ నాలుగో టెస్ట్ కోసం మాంచెస్టర్‌కు వెళ్తుండగా, భారత్ తిరిగి సమతుల్యం సాధించాలంటే తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది.