Site icon HashtagU Telugu

1st Day Ind Vs Eng: చివరి టెస్టులో రాణించిన పంత్, జడేజా..భారత్ స్కోర్ 338/7

Rishabh

Rishabh

ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా తొలిరోజు తడబడి నిలబడింది. టాపార్టర్ బ్యాటర్లు విఫలమైన వేళ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కాన్ఫిడెంట్ గానే ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు పుజారా, శుభ్ మన్ గిల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. గిల్ 17 , పుజారా 13 రన్స్ కే ఔటవగా…విహారీ 20 పరుగులకు ఔటయ్యాడు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు.

కోహ్లీ కేవలం 11 రన్స్ కే పెవిలియన్ చేరుకోగా…శ్రేయాస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. దీంతో భారత్ 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ , ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. గత ఏడాది ఆసీస్ టూర్ తర్వాత పెద్దగా రాణించని పంత్ ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అటు జడేజా కూడా అతనికి చక్కని సపోర్ట్ ఇవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. తొలి సెషన్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే చాలా సేపు వర్షం కురవడం, మైదానం తడిగా ఉండటంతో ఆట దాదాపు గంటన్నర వరకు నిలిచిపోయింది.

తిరిగి ప్రారంభమైన తర్వాత పంత్ మరింత దూకుడుగా ఆడాడు. 51 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పంత్ 89 బంతుల్లో శతకాన్ని సాధించాడు. పంత్ 146 పరుగులకు ఔటవగా.. జడేడా ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో జడ్డూ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెలుతురు సరిగా లేకపోవడంతో అరగంట ముందే ఆటను ముగించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. జడేజా 83 , షమీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ 3 , పాట్స్ 2 , స్టోక్స్ , రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Exit mobile version