టీమిండియా సభ్యులు వరుస గాయాలతో మ్యాచ్ లకు దూరం కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు జడేజా, బుమ్రా దూరం కాగా.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కాలుకు గాయం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 వార్మప్ మ్యాచ్ లో సోమవారం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు, ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ వార్మప్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో దీపక్ హుడా, మహమ్మద్ షమీ, ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీతో పాటు రిషబ్ పంత్ కెమెరాకు చిక్కారు.
మొయిన్ అలీతో చిట్ చాట్ చేస్తున్న టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాటర్ పంత్ అతని కుడి మోకాలిపై భారీ పట్టీ, ఐస్ ప్యాక్‌తో కనిపించాడు. దింతో ఈ యువ క్రికెటర్ కు గాయం అయినట్లు తెలుస్తోంది.పంత్‌కు మోకాలి గాయం అయిందా లేదా అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంకా ధృవీకరించలేదు. అయితే పంత్ కు అయిన గాయానికి ఫ్యాన్స్ భయపడాలిసిన అవసరం లేదని తెలుస్తోంది. పంత్ నొప్పి నుంచి ఉపశమనం కోసం మోకాలిపై ఐస్ ప్యాక్‌ని ఉపయోగించినట్లు సమాచారం.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు గాయపడడం టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, కీలక ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన విషయం తెలిసిందే. బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయపడ్డాడు. వెన్ను నొప్పితో దీపక్ చాహర్ జట్టుకు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్, షమీ వంటి ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.