టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

ప్రస్తుతానికి వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉండగా పంత్ బ్యాకప్‌గా జట్టులో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: భారత్- న్యూజిలాండ్ జట్లు తొలి వన్డే కోసం ముమ్మరంగా సిద్ధమవుతున్న వేళ టీమ్ ఇండియాలో ఆందోళన మొదలైంది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఆటగాడు గాయపడటంతో అతడిని మైదానం వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే తిలక్ వర్మ గాయంతో దూరం కాగా.. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న మరో కీలక ఆటగాడు గాయపడటం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు తలనొప్పిగా మారింది.

నెట్స్‌లో గాయపడ్డ రిషబ్ పంత్

టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డారు. గాయం తీవ్రత దృష్ట్యా ఫిజియోలు అతడిని వెంటనే మైదానం నుండి తీసుకెళ్లారు. పంత్ గాయం ఎంత తీవ్రమైనదనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

Also Read: న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా!

ప్రస్తుతానికి వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉండగా పంత్ బ్యాకప్‌గా జట్టులో ఉన్నారు. అయితే ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్, తుది జట్టులో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఈ గాయం అతడి అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పంత్ గాయం పెద్దది కాకూడదని, రేపటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తొలి వన్డేకు టీమ్ ఇండియా ‘ప్లేయింగ్ 11’ సిద్ధం

వడోదరలో జరగనున్న తొలి వన్డే కోసం భారత తుది జట్టు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది.

ఓపెనర్లు: కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

మిడిల్ ఆర్డర్: మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నారు.

వికెట్ కీపర్: కేఎల్ రాహుల్ ఆడటం దాదాపు ఖాయం.

ఆల్ రౌండర్లు: వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా స్థానం పక్కాగా కనిపిస్తోంది.

బౌలింగ్: బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.

  Last Updated: 10 Jan 2026, 08:54 PM IST