Site icon HashtagU Telugu

Rishabh Pant: పంత్ ఆరోగ్యంపై వైద్యుల స్టేట్ మెంట్.. నిద్రమత్తే కారణమా..?

pant

Resizeimagesize (1280 X 720) (3)

కారు ప్రమాదంలో గాయపడిన భారత వికెట్ కీపర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. డెహ్రడూన్ లోని హాస్పిటల్ లో పంత్ (Rishabh Pant) చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు. ప్రమాదంలో పంత్ తలకు, కాలికి బాగా గాయలయ్యాయని, కాలికి ఫ్రాక్చర్ అయినట్టు హాస్పిటల్ లో డాక్టర్ వెల్లడించారు. ఆర్థోపెడిక్ , ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందన్నారు. పంత్ అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డాడని, కోలుకునేందుకు సమయం పడుతుందన్నారు. ప్రమాద సమయంలో అతని కారులో మంటలు చెలరేగడంతో పంత్ వీపు వెనుక కాలిన గాయాలవడం ఫోటోల్లో కనిపించింది. మొత్తం మీద పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవాళ తెల్లవారుఝామున రూర్కెలా హైవ్ పై పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా నేషనల్ హైవే 58పై పంత్ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత దాదాపు 30 మీటర్ల వరకూ రెయిలింగ్ ను ఢీకొని కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది. అనంతరం ఒక్కసారిగా కారు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో కారు విండో పగలకొట్టుకుని పంత్ బయటకు దూకేసినట్టు పోలీసులు తెలిపారు. దూకినప్పుడు పంత్ కాలికి, తలకు బలమైన గాయాలవడంతో స్పృహ కోల్పోయాడు. స్థానికులు హుటాహుటిన పంత్ ను ఆసుపత్రికి తరలించారు.

Also Read: Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. డబ్బు, నగలు దొంగతనం..!

ప్రమాద సమయంలో పంత్ స్వయంగా కారు నడుపుతుండగా.. మరెవరూ కారులో లేరని తెలుస్తోంది. ప్రమాదం దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది. వేగంతో వచ్చిన పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టడం , అనంతరం మంటల్లో కాలిపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రమాదంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భారత క్రికెటర్లు, మాజీ ఆటగాళ్ళు, అభిమానులు పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడని, త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్ తో పాటు సహచర క్రికెటర్లు ట్వీట్లు చేశారు. ఇటీవలే బంగ్లాదేశ్ టూర్ ఆడిన పంత్ వచ్చే లంకతో సిరీస్ కు ఎంపిక కాలేదు.