Site icon HashtagU Telugu

Dipa Karmakar: స్టార్ జిమ్నాస్ట్ పై రెండేళ్ళు బ్యాన్ ?

Dipa karmakar.jpg

Dipa Imresizer

క్రీడారంగంలో ఉన్న అథ్లెట్లు డోపింగ్ టెస్టులు చేయించుకోవాల్సిందే., దీని కోసం ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం డోపింగ్ టెస్టుకై శాంపిల్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం వారు తప్పు చేసినట్టే లెక్క.. తర్వాత నిషేధాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటోంది భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. 2016 రియో ఒలింపిక్స్ లో ప్రదర్శన తర్వాత దీపా కర్మాకర్ అందరి దృష్టినీ ఎలా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన ప్రదర్శనతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ కు చేరిన దీపా కర్మాకర్ తృటిలో ఒలింపిక్ మెడల్ కోల్పోయింది. అయితే ఆమె ప్రదర్శన మాత్రం అభిమానులకు గుర్తుండిపోయింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతూ పతకాలు గెలుచుకుంది. తాజాాగా దీపా కర్మాకర్ చిక్కుల్లో పడింది.

యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ , జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా నిబంధనలను ఈ యువ అథ్లెట్ అతిక్రమించినట్టు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది. దీపా కర్మాకర్ దీనిని పాటించలేదని తెలుస్తోంది. అందుకే ఆమెపై నిషేధం విధించే అవకాశముంది. అయితే స్పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా, భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఇప్పటి వరకూ దీపా కర్మాకర్ నిషేధంపై అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్‌ తృటిలో పతకం మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో దీపా కర్మాకర్‌ రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన ఆమె కొట్‌బస్‌లో రజతం సాధించింది. 2015లో అర్జున అవార్డు‌ని పొందిన దీపా కర్మాకర్.. 2016లో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది.

Exit mobile version