LSG vs KKR: ప్లే ఆఫ్ కు చేరిన లక్నో… చివరి మ్యాచ్ లో కోల్ కతాపై విక్టరీ

LSG vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 12:22 AM IST

LSG vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో 1 పరుగు తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. ప్లే ఆఫ్ కు చేరిన మూడో జట్టు లక్నోనే. ఇప్పటికే గుజరాత్, చెన్నై కూడా ప్లే ఆఫ్ బెర్తులు ఖాయం చేసుకున్నాయి.
మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నోకు ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. కరణ్ శర్మ 3 పరుగులకే ఔటవగా.. తర్వాత ధాటిగా ఆడిన మంకడ్ 26 పరుగులకు వెనుదిరిగాడు. స్టోయినిస్ డకౌటవడం..కెప్టెన్ కృనాల్ పాండ్యా కూడా నిరాశపరచడంతో లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది.

డికాక్ కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో 28 పరుగులకు ఔటయ్యాడు. దీంతో లక్నో 73 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే ఆయూష్ బదౌనీ, నికోలస్ పూరన్ పార్టనర్ షిప్ తో కోలుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్ కు 74 పరుగులు జోడించారు. బదౌనీ 25 పరుగులు చేయగా… మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పూరన్ కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. వీరిద్దరి జోరుతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది.

177 పరుగుల లక్ష్యఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ కు మెరుపు ఆరంభం దక్కింది. రన్ రేట్ పెంచుకునే ఉద్ధేశంలో ధాటిగా ఆడిన ఓపెనర్లు జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్ తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. అయితే పవర్ ప్లే తర్వాత లక్నో బౌలర్లు పుంజుకున్నారు. దీంతో కోల్ కతా వరుస వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ 24 , నితీశ్ రాణా 8 ,గుర్బాజ్ 10 పరుగులకే ఔటవగా.. ధాటిగా ఆడిన జాసన్ రాయ్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 పరుగులు చేశాడు. ఈ దశలో రింకూ సింగ్ , రస్సెల్ క్రీజులో ఉండడంతో కోల్ కతాకు విజయం సాధ్యమే అనిపించింది.

ఒక సిక్సర్ కొట్టి ఫామ్ లో ఉన్నట్టు కనిపించిన రస్సెల్ ను రవి బిష్ణోయ్ అద్భుతమైన బంతిలో క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తర్వాత రింకూసింగ్ ధాటిగా ఆడినప్పటకీ…మిగిలిన బ్యాటర్ల నుండి సపోర్ట్ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చివరి రెండు ఓవర్లలో రింకూసింగ్ మరోసారి మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. దీంతో సంచలన విజయం సాధించేలా కనిపించింది.

చివరి ఓవర్ లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా… రింకూ సింగ్ మెరుపులు మెరిపించినా 19 పరుగులే చేయగలిగింది. దీంతో కోల్ కతా విజయానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కోల్ కతా 175 పరుగులే చేయగలిగింది. ఈ విజయం తర్వాత 17 పాయింట్లతో లక్నో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అటు సీజన్ లో 8వ ఓటమితో కోల్ కతా టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక ఆదివారం జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్ లతో చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదనేది తేలనుంది.