Site icon HashtagU Telugu

GT vs KKR IPL 2023: రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌.. గుజరాత్‌ పై కోల్‌కతా స్టన్నింగ్ విక్టరీ..

GT vs KKR

Rinku Singh's Brilliant Innings.. Kolkata's Stunning Victory Over Gujarat Gt Vs Kkr

GT vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. అసలు గెలుపుపై ఆశలు లేని మ్యాచ్‌లో రింకూ సింగ్ సిక్సర్లతో విరుచుకుపడి కోల్‌కతాను గెలిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన వీరోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌కు (GT) షాకిచ్చాడు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ భారీస్కోర్ చేసింది. 33 పరుగులకే సాహా వికెట్ కోల్పోయినప్పటకీ.. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పారు. రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు.

గిల్ 39 రన్స్‌కు ఔటవగా.. సాయిసుదర్శన వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అయితే చివర్లో గుజరాత్ వరుస వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విజయ్ శంకర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. విజయ్ శంకర్ కేవలం 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. చివరి 2 ఓవర్లలో గుజరాత్ 45 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఛేజింగ్‌లో కోల్‌కతా తడబడింది. 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. గుర్బాజ్ 15, జగదీశన్ 6 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ నితీశ్ రాణాతో కలిసి అదరగొట్టాడు. మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. వీరిద్దరి జోరుతో కోల్‌కతా ఇన్నింగ్స్ వేగంగానే సాగింది. నితీశ్ రాణా 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులకు ఔటవగా.. వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసాడు. అయితే 16 ఓవర్ నుంచి గుజరాత్ పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా 17వ ఓవర్‌లో గుజరాత్ కెప్టెన్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

వరుస బంతుల్లో రస్సెల్, నరైన్, శార్థూల్ ఠాకూర్‌ను ఔట్ చేశాడు. దీంతో కోల్‌కతా ఓటమి ఖాయమని అంతా భావించారు. అప్పటికి విజయం కోసం ఇంకా 50 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ సింగ్, ఉమేశ్ యాదవ్ క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్‌లో విజయానికి 29 పరుగులు చేయాల్సి ఉంది. కోల్‌కతా టీమ్‌కు విజయంపై నమ్మకం లేదు. అయితే రింకూ సింగ్ అనూహ్యంగా రెచ్చిపోయాడు.యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి కోల్‌కతాను గెలిపించాడు. రింకూ సింగ్ 21 బంతుల్లోనే 6 సిక్సర్లు, 1 ఫోర్‌తో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వృథా అయింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇదే తొలి ఓటమి.

Also Read:  Solutions for Employee Stress: ఒత్తిడిలో ఉద్యోగులు.. పరిష్కార మార్గాలు