India vs West Indies: టీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ గా అతడే.. రింకూ సింగ్ కు ఛాన్స్?

టీమిండియా (India) మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. ఇటీవలే బీసీసీఐ విండీస్ తో టెస్ట్, వన్డే సిరీస్ లకు జట్టును ఎంపిక చేసింది.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 05:15 PM IST

India vs West Indies: కరేబియన్ టూర్ కు టీమిండియా రెడీ అవుతోంది. డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత జట్టుకు దాదాపు నెల రోజుల విరామం దొరికింది. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ తో సహా పలువురు హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గ్యాప్ తర్వాత భారత్ ఆడబోయే తొలి సిరీస్ విండీస్ తోనే. ఈ టూర్ లో టీమిండియా (India) మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. ఇటీవలే బీసీసీఐ విండీస్ తో టెస్ట్, వన్డే సిరీస్ లకు జట్టును ఎంపిక చేసింది. అయితే టీ ట్వంటీ సిరీస్ కు జూలై మొదటి వారంలో జట్టును ప్రకటించే అవకాశముంది. టీ ట్వంటీ సిరీస్ కు పలువురు సీనియర్ క్రికెటర్లకు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ లో రాణించిన పలువురు యువ ఆటగాళ్ళకు సెలక్టర్లు పిలుపునిచ్చే ఛాన్సుంది. టీ ట్వంటీ ఫార్మాట్ కు హార్థిక్ పాండ్యాను సారథిగా కొనసాగించనుండగా… ఐపీఎల్ లో అదరగొట్టిన రింకూ సింగ్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్ తన మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు.

జట్టు విజయం కోసం 29 రన్స్ చేయాల్సిన దశలో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. అలాగే పలు మ్యాచ్ లలో చివర్లో బ్యాటింగ్ కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. తద్వారా కోల్ కతా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో టీమిండియాకు (India) సరైన ఫినిషర్ దొరకడం లేదు. చాలా కాలంగా ఫినిషర్ రోల్ కోసం టీమ్ మేనేజ్ మెంట్ అన్వేషణ కొనసాగుతోంది. షార్ట్ ఫార్మాట్ లో ఆ లోటు రింకూ సింగ్ తో భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడే రింకూ సింగ్ పై అంచనాకు రాలేకున్నా… అవకాశాలిస్తే మంచి ఫినిషర్ గా రింకూ సింగ్ రాటుదేలతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీంతో టీ ట్వంటీ ఫార్మేట్ లో అతని ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి చాలా కాలంగా షమీని టీ ట్వంటీ ఫార్మాట్ లో పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఇటీవల ఐపీఎల్ సీజన్ లో మాత్రం షమీ అదరగొట్టాడు. గుజరాత్ తరపున ఆడిన షమీ 28 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు సంబంధించి టెస్ట్ , వన్డేల్లో ఆడుతున్నా… విండీస్ టూర్ కు విశ్రాంతినిచ్చారు. అయితే షార్ట్ ఫార్మాట్ కు షమిని ఎంపిక చేసే అవకాశముంది.

Also Read:  Squeezing Of Testicles : వృషణాలను పిసకడం హత్యాయత్నం కాదు : కర్ణాటక హైకోర్టు