T20 Women’s World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న హర్మన్ ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. నిజానికి పవర్ ప్లేలోనే ఇంగ్లాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ వ్యాట్ డకౌటవగా.. డంక్లీ 10 , క్యాప్సీ 3 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో బ్రంట్ , హీదర్ నైట్ , వికెట్ కీపర్ జోన్స్ ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. కీలక సమయంలో వీరి పార్టనర్ షిప్ ఆ జట్టుకు మంచి స్కోర్ అందించింది. బ్రంట్ 50 , జోన్స్ 40 , నైట్ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేసింది. 4 ఓవర్లలో 15 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
152 పరుగుల లక్ష్య ఛేదనలో భారత మహిళల జట్టు త్వరగానే ఓపెనర్ షెఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన ధాటిగా ఆడినప్పటకీ… మరో ఎండ్ లో వరుసగా రోడ్రిగ్స్ , కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఔటవడం దెబ్బతీసింది. అయితే రిఛా ఘోష్ తన ఫామ్ కొనసాగించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. స్మృతి , రిఛా ఘోష్ 43 పరుగులు జోడించారు.స్లాగ్ ఓవర్లలో వరుస వికెట్లు మరోసారి భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయి. స్మృతి మంధాన 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులకు చేయగా…రిఛా ఘోష్ 47 రన్స్ తో చివరి వరకూ నాటౌట్ గా నిలిచినా ఫలితం లేకపోయింది. చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు భారత్ ను కట్టడి చేశారు. ఫలితంగా భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 140 పరుగులే చేయగలిగింది. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఐర్లాండ్ తో ఫిబ్రవరి 20న తలపడుతుంది.