Team India:టార్గెట్ సిరీస్

ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ టీ ట్వంటీ సిరీస్ విజయంపై కన్నేసింది.

  • Written By:
  • Updated On - July 9, 2022 / 12:28 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ టీ ట్వంటీ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇవాళ బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. సీనియర్ ఆటగాళ్ళు కోహ్లీ, జడేజా, బూమ్రాతో పాటు పంత్ జట్టులోకి రానుండడంతో భారత్ బలం మరింత పెరిగింది. వీరి రాకతో తుది జట్టులో పలువురు యువ ఆటగాళ్ళపై వేటు పడనుంది.
టీ ట్వంటీ ప్రపంచకప్‌కు జట్టు కూర్పే లక్ష్యంగా సాగుతున్న వేళ ఇంగ్లాండ్‌తో రెండో టీ ట్వంటీకి టీమిండియా సన్నద్ధమైంది. సొంతగడ్డపై తిరుగులేని బలంగా ఉండే ఇంగ్లీష్ టీమ్‌పై తొలి టీ ట్వంటీలో రోహిత్‌సేన ఘనవిజయాన్ని అందుకుంది. బ్యాటర్లు ఫామ్ కొనసాగించడం, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు అదే ఊపులో రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఈ మ్యాచ్‌ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. టెస్ట్ మ్యాచ్‌ ఆడిన తర్వాత రెస్ట్ తీసుకున్న కోహ్లీ, పంత్, జడేజా, బూమ్రా జట్టులోకి తిరిగి రానున్నారు. దీంతో తొలి టీ ట్వంటీలో ఆడిన యువ ఆటగాళ్ళు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఓపెనింగ్‌కు సంబంధించి రోహిత్‌కు తోడుగా కోహ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశముంది. అటు ఫామ్‌లో ఉన్న దీపక్‌హుడా, హార్థిక్ పాండ్యా చెలరేగాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. పాండ్యా గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అటు బంతితోనూ రాణించి 4 వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ ముంగిట హార్థిక్ తన ఫామ్ కొనసాగించడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. బౌలింగ్‌లో బూమ్రా రాకతో పేస్ పదును మరింత పెరిగింది. అతనికి తోడుగా హర్షల్ పటేల్‌తో పాటు స్పిన్నర్లు చాహల్‌ నిలకడగా రాణిస్తున్నారు. దీంతో మరోసారి సమిష్టి ప్రదర్శన కనబరిస్తే ఇంగ్లాండ్‌పై సిరీస్ గెలుచుకోవడం టీమిండియాకు పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

మరోవైపు తొలి టీ ట్వంటీలో ఓడినప్పటకీ ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేం. బట్లర్, రాయ్ , మలాన్, లివింగ్ స్టోన్, మెయిన్ అలీ వంటి ఆటగాళ్ళు ఆ జట్టులో కీలకమైన ఆటగాళ్ళు. వీరంతా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్న వారు కావడంతో నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే. దీనికి తోడు సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ చివరి వరకూ పోరాడుతుందనడంలో సందేహం లేదు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయక తప్పదు. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఎడ్జ్‌బాస్టన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. పేసర్లకు కూడా సహకరిస్తుందని గత రికార్డులు చెబుతున్నాయి. ఈ పిచ్‌పై 2014లో భారత్ ఒక మ్యాచ్ ఆడగా… 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది.