Karun Nair: లార్డ్స్ టెస్ట్‌లో టీమ్ ఇండియా 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడవలసి వచ్చింది. భారత బ్యాట్స్‌మన్లు 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. కరుణ్ నాయర్ (Karun Nair) వరుస వైఫల్యాల తర్వాత కూడా లార్డ్స్‌లో అవకాశం పొందాడు. కానీ ఇక్కడ కూడా అతని బ్యాట్ పూర్తిగా ఆశించిన స్థాయిలో రాణించలేదు. మూడో టెస్ట్‌లో ఓటమి తర్వాత కరుణ్‌ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కరుణ్ స్థానంలో ప్లేయింగ్ 11లో చేర్చేందుకు ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి. మొదటిది అభిమన్యు ఈశ్వరన్, రెండవది సాయి సుదర్శన్. భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అభిప్రాయం ప్రకారం.. నాల్గవ టెస్ట్‌లో భారత జట్టు కరుణ్ స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలి.
కరుణ్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి?
జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ దీప్ దాస్‌గుప్తా టీమ్ ఇండియాకు ప్లేయింగ్ 11లో ఒక మార్పు చేయాలని సలహా ఇచ్చాడు. “ప్లేయింగ్ 11లో ఒకటి కంటే ఎక్కువ మార్పులు అవసరం లేదు. ఒక మార్పు చేయాలంటే కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలి. దీనికి కారణం కరుణ్ గణనీయమైన పరుగులు చేయలేదు. అతనికి మంచి ఆరంభం లభించినప్పటికీ, దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. నా అభిప్రాయం ప్రకారం, అతను క్రీజ్‌పై అసౌకర్యంగా కనిపించాడు. అంతేకాక, సాయి సుదర్శన్ ఒక యువ ఆటగాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఎవరిపైనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, యువ ఆటగాడిపై పెట్టండి. కరుణ్‌కు అన్ని టెస్ట్ మ్యాచ్‌లలో మంచి ఆరంభం లభించినప్పటికీ, అతను లయలో కనిపించలేదు” అని పేర్కొన్నాడు.
Also Read: BR Naidu : తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజి కేంద్రానికి భూమిపూజ
మాజీ భారత క్రికెటర్ మరింత మాట్లాడుతూ.. “భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేయాలనుకుంటే సాయి సుదర్శన్ వంటి బ్యాట్స్‌మన్‌పై పెట్టుబడి పెట్టండి. ఇంగ్లాండ్‌లో మళ్లీ సిరీస్ ఆడేందుకు ఎప్పుడు వస్తామో తెలియదు., కాబట్టి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలి” అని తెలిపాడు.
విఫలమైన కరుణ్ నాయర్
కరుణ్ నాయర్‌కు వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చారు. కానీ ప్రతిసారీ మంచి ఆరంభం తర్వాత తన వికెట్‌ను సులభంగా ఇచ్చేశాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను 40 పరుగులు చేశాడు. కానీ ఈ ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మలచలేకపోయాడు. 6 ఇన్నింగ్స్‌లలో కరుణ్ ఇప్పటివరకు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో అతను ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేదు. సాయి సుదర్శన్‌కు కూడా హెడింగ్లీ టెస్ట్‌లో అవకాశం ఇవ్వబడింది. కానీ అతను బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు.