BCCI Relief: గంగూలీ, జైషాలకు సుప్రీంలో ఊరట

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బోర్డులో మరో దఫా కొనసాగేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 06:05 PM IST

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బోర్డులో మరో దఫా కొనసాగేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి బీసీసీఐ రాజ్యాంగంలో సవరణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘంలో వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మూడేళ్ళు విరామం తీసుకోవాలి.

దీని ప్రకారం రాష్ట్ర సంఘంలో మూడేళ్ళు, బీసీసీఐలో మూడేళ్ళు లేదా వరుసగా రాష్ట్రంలో మూడేళ్ళ చొప్పున రెండుసార్లు లేదా బీసీసీఐలో వరుసగా మూడేళ్ళ పాటు రెండుసార్లు పదవుల్లో ఉంటే మూడేళ్ళపాటు బ్రేక్ తప్పనిసరి చేసింది. అయితే రాష్ట్రంలో మూడేళ్ళు చేసిన తర్వాత బీసీసీఐలో మూడేళ్ళ పూర్తి చేసుకుంటే రెండింటినీ విడివిడిగా చూడాలని బీసీసీఐ సుప్రీంకోర్టును కోరింది. లోథా కమిటీ గతంలో ఇచ్చిన సిఫార్సులను సవాల్ చేస్తూ పిటీషన్ వేసింది. గత కొంత కాలంగా దీనిపై విచారణ జరుగుతోంది. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం చూసుకుంటే గంగూలీ, జైషా పదవీకాలం ఈ సెప్టెంబర్‌తోనే ముగిసిపోయింది.

మరోసారి కొనసాగేందుకు అవకాశం లేదు. మూడేళ్ళు బ్రేక్ తీసుకునే మళ్ళీ బీసీసీఐలోకి రావాల్సి ఉంటుంది. దీంతో లోథా కమిటీ సిఫార్సులను మార్చుకునేందుకు వీలుగా అనుమతివ్వాలని గంగూలీ, జైషా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బోర్డు వాదనలను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లో మార్పులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర సంఘంలో మూడేళ్ళు చేసిన తర్వాత బీసీసీఐలో మూడేళ్ళు పదవిలో ఉన్నా.. వెంటనే కూలింగ్ ఆఫ్ పిరీయడ్ వర్తించదు. మరో మూడేళ్ళు కొనసాగి ఆ తర్వాత విరామం తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గంగూలీ, జైషా తమ తమ పదవుల్లో మరో మూడేళ్ళ పాటు కొనసాగనున్నారు.