RCB vs LSG: లక్నోపై రివేంజ్ తీర్చుకున్న బెంగళూరు… లోస్కోరింగ్ మ్యాచ్‌లో గెలిచిన ఆర్‌సీబీ

వరుసగా కొన్ని రోజుల నుంచి భారీస్కోర్లతో అలరించిన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అనూహ్యంగా లో స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులకు మజానిచ్చింది.

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 11:57 PM IST

RCB vs LSG: వరుసగా కొన్ని రోజుల నుంచి భారీస్కోర్లతో అలరించిన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అనూహ్యంగా లో స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులకు మజానిచ్చింది. తమ హోంగ్రౌండ్‌లో చివరి బంతికి గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. లక్నో వేదికగా జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 రన్స్ తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. స్లో వికెట్‌పై కోహ్లీ, డుప్లెసిస్ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. కోహ్లీ 30 బంతుల్లో 3 ఫోర్లతో 31 , డుప్లెసిస్ 40 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేశారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది. అనూజ్ రావత్ 9 , మాక్స్‌వెల్ 4, ప్రభుదేశాయ్ 6, లోమ్రర్ 3 పరుగులకే వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 16 రన్స్‌ దగ్గర రనౌటవడం కూడా బెంగళూరును దెబ్బతీసింది.

చివరి వరుస బ్యాటర్లు కూడా వరుసగా ఔటవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 126 పరుగులే చేయగలిగింది.లక్నో బౌలర్లలో నవీనుల్‌ హక్ 3 , రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టగా.. గౌతమ్ 1 వికెట్ తీశాడు.

స్లో పిచ్ కావడంతో స్వల్ప టార్గెట్‌ను ఛేజ్ చేయడం అంత సులభం కాదని లక్నోకు ఆరంభంలోనే అర్థమైంది. తొలి బంతికే కైల్ మేయర్స్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఇక్కడ నుంచి లక్నో వరుస వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్టే వెనుదిరిగారు. ఆయుష్ బదౌనీ 4, కృనాల్ పాండ్యా 14, దీపక్ హుడా 1 , నికోలస్ పూరన్ 9 పరుగులకే ఔటయ్యారు. అయితే స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్ భారీ షాట్లు కొట్టడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగానే కనిపించింది. ఈ దశలో మరోసారి పుంజుకున్న బెంగళూరు బౌలర్లు వీరిద్దరినీ వెంటనే వెంటనే ఔట్ చేసి లక్నోను దెబ్బకొట్టారు.

చివర్లో అమిత్ మిశ్రా, నవీనుల్‌హక్ పోరాడినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో వీరిద్దరూ కూడా ఔటయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అంత సౌకర్యవంతంగా కనిపించని రాహుల్ 3 బాల్స్ ఆడినా పరుగులేమీ చేయలేదు. దీంతో లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆర్‌సీబీ బౌలర్లలో హ్యాజిల్‌వుడ్ 2, కరణ్ శర్మ 2 వికెట్లు పడగొట్టగా… సిరాజ్, మాక్స్‌వెల్, హసరంగ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇది ఐదో విజయం.