Site icon HashtagU Telugu

Ravindra Jadeja: వైరల్ అవుతున్న జడేజా ఖడ్గం ఫీట్ వీడియో

Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: హైదరాబాద్ వేదికగా భార‌త్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భార‌త స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర‌ జ‌డేజా టాప్ క్లాస్ షోతో అద‌ర‌గొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ టీమ్ ను దెబ్బ‌కొట్టాడు. క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా 87 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

మైదానంలో చాలా కాలం తర్వాత జడ్డు తన బ్యాట్ ని ఖడ్గంలా తిప్పుతూ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జడేజా తన మార్క్ సెలెబ్రేషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సమయంలో ఉప్పల్‌ స్టేడియం చప్పట్లతో మారుమోగిపోయింది. జడేజా అలా రాజసంగా బ్యాట్‌ను తిప్పుతుంటే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. అంతేకాదు తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడు వికెట్లతో మరోసారి జడేజా ఆల్ రౌండర్ ప్రదర్శన ఇచ్చాడు. 2012లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన జడేజా 2018 వరకు 59 ఇన్నింగ్స్‌లలో 31 సగటుతో 1404 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ నమోదైంది. ఆ తర్వాత జడేజా బ్యాటింగ్‌లో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 నుంచి జడేజా 41 ఇన్నింగ్స్‌లలో 45 సగటుతో 1473 పరుగులు చేశాడు. ఈ కాలంలో జడేజా 11 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించాడు.

రవీంద్ర జడేజాతో పాటు కేఎల్ రాహుల్ మెరిశాడు. ఈ క్రమంలో రాహుల్ కీలక 50వ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ 86 పరుగులు చేసి 14 ప‌రుగుల తేడాతో సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ద్వారా కేఎల్ రాహుల్ స్వ‌దేశంలో టెస్టుల్లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ వేగం పెంచాడు. ఈ క్రమంలో 65వ ఓవ‌ర్‌లో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి రెహాన్ అహ్మద్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఇదే ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్‌ 80 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. కానీ శతకం నమోదు చేయకుండానే పెవిలియన్ చేరాడు. విశేషమేంటంటే ఈ ఇన్నింగ్స్ లో 87 పరుగుల వద్ద రవీంద్ర జడేజా, 86 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 80 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 246 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత్‌ 121 ఓవర్లలో 436 పరుగులు చేసింది. మొత్తంగా తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఇంగ్లండ్ జట్టుపై 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

Also Read: Rohit Sharma: నాకు రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యం